పయనించే సూర్యుడు మార్చ్ 31(సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం ప్రతినిధి స్వాతి.నర్సిములు): జహీరాబాద్ మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ మహమ్మద్ యూనూస్ అధ్యక్షతన జరిగిన 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్ సమావేశం తీవ్ర గందరగోళం మధ్య కొనసాగింది. బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంలో సమావేశం ప్రారంభానికి ముందే పలువురు కౌన్సిలర్లు గత సమావేశంలో ప్రస్తావించిన అంశాల పురోగతిని కోరడంతో సభలో ఉద్రిక్తత నెలకొంది. రోడ్లపై ఫ్లెక్సీల ఏర్పాటు మరియు డివైడర్లపై ఏర్పాటు చేసిన జెండాల తొలగింపు వంటి అంశాలపై సభ్యుల మధ్య పరస్పర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో బీజేపీ కౌన్సిలర్ బొగ్గుల సంతోష్ మరియు కాంగ్రెస్ కౌన్సిలర్ మహమ్మద్ జాహంగీర్ల మధ్య మాటల యుద్ధం పెరగడంతో సంతోష్ నిరసనగా సభ నుండి వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. అదేవిధంగా బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ కౌన్సిలర్ల మధ్య స్థానిక సమస్యల ప్రస్తావన విషయంలో తగినంత సమయం ఇవ్వడం లేదని సభ్యులు ఒకరిపై ఒకరు వాగ్వాదానికి దిగారు. తోటి సభ్యులు మరియు చైర్మన్ సర్దిచెప్పడంతో సభ కొనసాగగా, చివరకు 2026-27 సంవత్సరానికి గాను రూ. 3080.46 లక్షల అంచనా బడ్జెట్‌కు సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.