పయనించే సూర్యుడు మార్చ్ 31(సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం ప్రతినిధి స్వాతి.నర్సిములు): జహీరాబాద్ మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన బడ్జెట్ సాధారణ సర్వసభ్య సమావేశంలో కౌన్సిలర్ అప్పం శ్రావణ్ కుమార్ కార్మికులు మరియు సామాన్య ప్రజల పక్షాన నిలబడి గట్టిగా గళమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బడ్జెట్ రూపకల్పన అనేది కేవలం అంకెల గారడీగా ఉండకూడదని, క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపేలా ఉండాలని స్పష్టం చేశారు.
ముఖ్యంగా మున్సిపల్ పారిశుధ్య కార్మికుల సమస్యలపై ఆయన అధికారులను నిలదీశారు. పట్టణాన్ని శుభ్రంగా ఉంచే కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో పాలకవర్గం వైఫల్యం చెందిందని విమర్శించారు. వారికి రావాల్సిన పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలని, పీఎఫ్, ఈఎస్ఐ వంటి సామాజిక భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే కార్మికులకు అవసరమైన రక్షణ పరికరాలను సకాలంలో అందించడం లేదని, దీనివల్ల వారి ఆరోగ్యం ప్రమాదంలో పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పట్టణ అభివృద్ధిపై మాట్లాడుతూ.. వార్డుల వారీగా నిధుల కేటాయింపులో వివక్ష చూపకూడదని, అన్ని వార్డుల్లో డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరించాలని కోరారు. వేసవి సమీపిస్తున్న తరుణంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని, వీధి దీపాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రజలు చెల్లించే పన్నుల నిధులు దుర్వినియోగం కాకుండా పారదర్శకతతో పనులు చేపట్టాలని, అవినీతికి తావులేకుండా బడ్జెట్ అమలు జరగాలని శ్రావణ్ కుమార్ హెచ్చరించారు. ప్రజల సమస్యల పరిష్కారం అయ్యే వరకు తన పోరాటం కొనసాగుతుందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.