పయనించే సూర్యుడు మర్చి 31 (మల్కాజిగిరి ఇంచార్జి డా. రఘుపతి ) ఓం శ్రీ శివ ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షులు డాక్టర్ రఘుపతి ఆధ్వర్యంలో, శ్రీశైలం మల్లికార్జున బ్రహ్మరాంబిక దేవస్థానం శాఖవారి గౌరీ సదన్‌లో మాకు గదులు ఏర్పాటు చేయబడిన సందర్భంలో ఒక హృద్యమైన సంఘటన చోటుచేసుకుంది. ఆ గదుల్లో మేము బస చేసిన తర్వాత, అనుకోకుండా నా ఐఫోన్ మరియు ఛార్జర్‌ను అక్కడే మర్చిపోయాను. తరువాత తిరిగి వెళ్లి విచారించగా, అక్కడ విధులు నిర్వహిస్తున్న ఆయా వినోదమ్మ ఆ వస్తువులను ఎంతో బాధ్యతతో భద్రపరిచి ఉంచారు. గదుల సూపర్వైజర్ రాజు గారి పర్యవేక్షణలో అవి నాకు యథావిధిగా తిరిగి అందజేయబడినవి. ఈ సంఘటనలో ప్రతిబింబించిన వినోదమ్మ గారి నిజాయితీ, కర్తవ్యనిబద్ధత, అలాగే రాజు గారి సమర్థమైన పర్యవేక్షణ మన సమాజానికి ఒక ఆదర్శం. తమకు అప్పగించిన పనిని కేవలం ఉద్యోగంగా కాకుండా, సేవగా భావిస్తూ వారు చూపిన నిబద్ధత ప్రతి ఒక్కరికీ మార్గదర్శకం. ఇలాంటి విలువలు కలిగిన సిబ్బంది వల్లనే భారతదేశం వంటి మహత్తర దేశంలో నమ్మకం, నీతి, ధర్మం నిలుస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ప్రతి ఒక్కరూ వీరిని ఆదర్శంగా తీసుకుని తమ విధుల్లో నిజాయితీ, బాధ్యతను పెంపొందించుకోవాలి. వినోదమ్మ , రాజు గారిలాంటి వ్యక్తులు సమాజంలో నైతిక విలువలకు ప్రతీకలు. వారి సేవలను హృదయపూర్వకంగా అభినందిస్తూ, వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సంఘటన మరెందరికో ప్రేరణగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాను.