ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు

పయనించే సూర్యుడు మార్చి 31 నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ బిజినపల్లి మండలం పాలెం గ్రామంలో బావులను పూడ్చివేసి ప్లాట్లుగా మార్చి అమ్మిన కొంతమంది వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సామాజిక ఉద్యమ కారుడు వావిలాల రాజశేఖర్ శర్మ, మాజీ సైనికుడు దుగ్యాని వెంకటయ్య లు మాట్లాడుతూ పాలెం గ్రామంలో త్రాగునీటి పథకం కింద ఉన్న రెండు బావులను కొంతమంది పూడ్చివేసి ప్లాట్లుగా మార్చి అమ్ముకున్నారన్నారు. ఈ రెండు బావులు బిజినపల్లికి వెళ్లే ప్రధాన రోడ్డుకు అతి సమీపంలో ఉండడంతో కొందరు కబ్జాదారులు ఈ బావులను పూడ్చివేశారన్నారు. ప్రస్తుతం ఇక్కడ భారీగా భూముల ధరలు ఉండడంతో దౌర్జన్యంగా బావులను పూడ్చి వేసి ప్లాట్లుగా అమ్ముకున్నారన్నారు.ఈ విషయంలో ఇదివరకే ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన ఎలాంటి స్పందన రాలేదని మరోసారి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తున్నామన్నారు. దీనికి స్పందించిన జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు ఫిర్యాదును పంపించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విచారణ చేసి రెండు బావులను కబ్జా చేసిన కబ్జారాయుళ్లపై కఠినంగా చర్యలు తీసుకోవాలని పాలెం గ్రామస్తులు డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *