పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 31 అశ్వారావుపేట మండలం రిపోర్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యారంగాన్ని విస్మరిస్తూ, ప్రైవేటు మరియు కార్పొరేట్ విద్యా సంస్థలను ప్రోత్సహించడానికి శ్రద్ధ చూపిస్తున్నారని, ఉపాధ్యాయులకు అనేక సమస్యలు సృష్టిస్తున్నారని, సమస్యల వలన విద్యా బోధనపై ప్రభావం పడకుండా ఉపాధ్యాయులందరూ ఐక్యంగా ఉండి విద్యారంగాన్ని కాపాడుకోవాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టిపిటిఎఫ్) రాష్ట్ర మాజీ కార్యదర్శి మునిగడప రామాచారి విమర్శించారు. సోమవారం నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం సున్నంబట్టిలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జనరల్ బాడీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. విద్యారంగాన్ని ప్రయోగశాలగా మార్చవద్దని హితవు పలికారు. గత ప్రభుత్వాలు మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ పాఠశాలల పేరుతో విద్యా వ్యవస్థను గందరగోళానికి గురిచేశాయని, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ స్థాపించే ఆలోచన చేయడం సరికాదని అన్నారు. రాష్ట్ర విద్యా కమిషన్ 20 పాఠశాలలను కలిపి ఒకే విద్యా సంస్థగా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఉపాధ్యాయులకు రావాల్సిన పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని, బకాయి ఉన్న డీఏ లను వెంటనే మంజూరు చేయాలని, కొత్త పీఆర్సీ ని ప్రకటించి, తక్షణమే అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీపీటీఎఫ్ జిల్లా కౌన్సిలర్ కె.మాధవరెడ్డి, మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జె.ప్రేమ్ సింగ్, బి.రమేష్, జిల్లా కౌన్సిలర్ వి.శ్రీను, మరియు మండల కమిటీ సభ్యులు జి.రాజబాబు, బి.దేవేందర్, బి. హీరాలాల్, బి.కోటేశ్వరరావు, బి.శోభన్ బాబు, బి.వెంకన్న, హెచ్. భాస్కర్ నాయక్, డి.సురేష్, జి.రవి తదితరులు పాల్గొన్నారు.