పయనించే సూర్యుడు మార్చ్ 31 (సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం ప్రతినిధి స్వాతి.నర్సిములు): జహీరాబాద్, మార్చి 30, 2026: క్రికెట్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో పట్టణంలోని యువత మరియు విద్యార్థులు బెట్టింగ్ అనే వ్యసనానికి బానిసలై తమ విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని జహీరాబాద్ టౌన్ ఎస్.ఐ. వినయ్ కుమార్ తీవ్రంగా హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు, యువతకు సుదీర్ఘ సందేశాన్ని విడుదల చేస్తూ, చదువుకోవాల్సిన వయసులో సులభంగా డబ్బు సంపాదించాలనే తప్పుడు ఆశతో బెట్టింగ్‌ల వైపు వెళ్లడం అత్యంత ప్రమాదకరమని పేర్కొన్నారు. ఒక్కసారి గెలిస్తే వచ్చే అతి ఆశ, పది సార్లు ఓడిపోయేలా చేసి చివరకు తీరని అప్పుల ఊబిలోకి నెడుతుందని, తల్లిదండ్రులు రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించిన సొమ్మును ఇలా పందాలకు తగలేయడం క్షమించరాని నేరమని ఆయన హితవు పలికారు. ముఖ్యంగా విద్యార్థుల భవిష్యత్తుపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని, బెట్టింగ్ యాప్స్ మరియు గ్యాంబ్లింగ్ సైట్ల వెనుక పడితే విద్యా సంవత్సరం పాడవ్వడమే కాకుండా, పోలీసు కేసుల్లో ఇరుక్కుంటే భవిష్యత్తు అంధకారమవుతుందని హెచ్చరించారు. ఒక్క క్రిమినల్ కేసు నమోదైనా అది సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు, సివిల్ సర్వీసెస్ లేదా విదేశీ ప్రయాణాల వంటి జీవితకాల కలలకు అడ్డంకిగా మారుతుందని గుర్తుచేశారు. డబ్బు పోగొట్టుకున్న యువత ఆ విషయాన్ని ఇంట్లో చెప్పలేక, బయట అప్పులు తీర్చలేక తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై ఆత్మహత్యల వంటి దారుణమైన నిర్ణయాలకు దారితీస్తున్నారని, మీరు తీసుకునే ఒక్క తప్పుడు నిర్ణయం కుటుంబం మొత్తాన్ని వీధిన పడేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీస్ శాఖ తరపున ఆయన స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. క్రికెట్ బెట్టింగ్ నిర్వహించడం లేదా అందులో పాల్గొనడం చట్టరీత్యా నేరమని, ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ద్వారా జరిగే మోసాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మీ కాలనీల్లో లేదా హాస్టళ్లలో ఎవరైనా అనుమానాస్పదంగా బెట్టింగ్‌లు నిర్వహిస్తుంటే వెంటనే Dial 100 కి సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచబడతాయని భరోసా ఇచ్చారు. యువత తమ శక్తిని సృజనాత్మక పనులకు, క్రీడలకు మరియు సమాజ సేవకు ఉపయోగించాలని, డబ్బు సంపాదనకు అడ్డదారులు వెతకడం మానుకోవాలని కోరారు. జహీరాబాద్ పట్టణాన్ని బెట్టింగ్ రహిత ప్రాంతంగా మార్చడంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎస్.ఐ. వినయ్ కుమార్ పిలుపునిచ్చారు. వినయ్ కుమార్, ఎస్.ఐ, జహీరాబాద్ టౌన్ పోలీస్, తెలంగాణ రాష్ట్ర పోలీస్.