హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను సద్వినియోగం చేసుకోవాలి : మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు.

పయనించే సూర్యుడు న్యూస్ చండూరు, మార్చి 31 : చండూరు మున్సిపాలిటీ పరిధిలో హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను బాలికలు, మహిళలు సద్వినియోగం చేసుకోవాలని చండూరు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు అన్నారు. మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న హెచ్ పి వీ వ్యాక్సిన్ కేంద్రాన్ని చండూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం ఆయ‌న ప్రారంభించి మాట్లాడారు. హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను సమర్థవంతంగా నివారించవచ్చని తెలిపారు. ప్రైవేట్ ఆస్ప‌త్రుల్లో ఈ వ్యాక్సిన్‌కు వేల రూపాయలు ఖర్చవుతుండగా, ప్రభుత్వ ఆస్ప‌త్రుల్లో దీనిని పూర్తిగా ఉచితంగా అందిస్తున్న‌ట్లు చెప్పారు. కావునా అర్హులైన బాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. చండూరు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ మాస రాజు మాట్లాడుతూ.. 14 నుండి 15 ఏళ్ల వయస్సు గల బాలికలకు వారి తల్లిదండ్రుల సమక్షంలో హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేయనున్నట్లు వివరించారు. అర్హులైన బాలికలు తమ ఆధార్ కార్డు ఫొటో కాపీని సమర్పించి, అన్ని పని దినాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీకా తీసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సంధ్యా బ్లెస్సి, సూపర్‌వైజ‌ర్ ఝాన్సీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది రజిని, మెహబూబి, మంగమ్మ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *