పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రియల్ 1 అనపర్తి నియోజకవర్గం ఇంచార్జ్ సురేష్ ఐపీఎల్ క్రికెట్ సీజన్ నేపథ్యంలో జిల్లాలో అక్రమ క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తూర్పుగోదావరి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) శ్రీ డి. నరసింహ కిషోర్, ఐపీఎస్ హెచ్చరించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, బెట్టింగ్ నిర్వాహకులు మరియు అందులో పాల్గొనే వారిపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలిపారు. బెట్టింగ్తో తీరని నష్టం తక్షణ లాభాల కోసం ఆశపడి యువత బెట్టింగ్ యాప్‌ల ఉచ్చులో పడొద్దని ఎస్పీ సూచించారు. "బెట్టింగ్ అనేది ఒక ప్రమాదకరమైన వ్యసనం. ఇది ఆర్థిక నష్టంతో పాటు మానసిక ఒత్తిడికి, కుటుంబ కలహాలకు మరియు చివరకు ఆత్మహత్యలకు దారితీస్తోంది. క్రికెట్‌ను కేవలం క్రీడగా మాత్రమే చూడాలి కానీ, జూదంగా మార్చుకోవద్దు" అని ఆయన విజ్ఞప్తి చేశారు. క్రిమినల్ కేసులతో కెరీర్ ఖతం చట్టవ్యతిరేకమైన క్రికెట్ బెట్టింగ్‌లో పాల్గొంటే ఏపీ గేమింగ్ యాక్ట్ కింద కఠిన కేసులు నమోదు చేస్తామని ఎస్పీ స్పష్టం చేశారు. ఒక్కసారి పోలీసు రికార్డుల్లో పేరు నమోదైతే, భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలు, పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ వంటి వాటికి తీవ్ర ఆటంకం కలుగుతుందని, తద్వారా యువత తమ విలువైన కెరీర్‌ను కోల్పోతారని ఆయన హెచ్చరించారు. ప్రత్యేక పోలీసు బృందాల నిఘా జిల్లా వ్యాప్తంగా ఆన్లైన్ మరియు ఆఫ్‌లైన్ బెట్టింగ్‌లను అరికట్టేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించినట్లు ఎస్పీ వెల్లడించారు. సైబర్ క్రైమ్ విభాగం సహాయంతో బెట్టింగ్ యాప్‌ల కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ముఖ్యంగా గ్యాంబ్లింగ్ నిర్వహించే ప్రధాన సూత్రధారులను పట్టుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. ప్రజలకు విజ్ఞప్తి మీ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిస్తే లేదా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డైల్ 112 లేదా స్థానిక పోలీసు స్టేషన్‌కు సమాచారం అందించాలని ఎస్పీ కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామని ఆయన హామీ ఇచ్చారు. సైబర్ నేరగాళ్ల మాయమాటలు నమ్మి కష్టార్జితాన్ని పోగొట్టుకోవద్దని జిల్లా ప్రజలను హెచ్చరించారు.