క్షయ వ్యాధి నిర్మూలనకు సమిష్టి కృషి అవసరం: డాక్టర్ రఫీక్

ప్రాణాంతకమైన క్షయ వ్యాధిని (టీబీ) సమిష్టి కృషితో పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని జిల్లా టీబీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ రఫీక్ పేర్కొన్నారు.

పయనించే సూర్యుడు ఏప్రిల్ 1 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ వంద రోజుల క్షయ వ్యాధి గుర్తింపు కార్యక్రమంలో భాగంగా బిజినేపల్లి మండలం పోలేపల్లి, వెలుగొండ గ్రామాల్లో మంగళవారం ప్రత్యేక శిబిరాలు నిర్వహించారు. ఈ శిబిరాల విజయవంతానికి ఆయా గ్రామాల సర్పంచులు మాధవి నరసింహ, నాగిరెడ్డి ప్రచారం నిర్వహించి సహకరించారు. భవిష్య భారత్ సంస్థ సహకారంతో బిజినపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ సృజన ఆధ్వర్యంలో ఈ శిబిరాలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా శిబిరానికి హాజరైన డాక్టర్ రఫీక్ మాట్లాడుతూ, క్షయ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే అది ఒకరి నుంచి మరొకరికి వ్యాపించి తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించారు. వ్యాధి నివారణకు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత కూడా ఎంతో ముఖ్యమని తెలిపారు. ప్రజల్లో అవగాహన పెంపొందితేనే వ్యాధులను సమర్థంగా ఎదుర్కొనగలమన్నారు. 14 ఏళ్లు పైబడిన వారికి ఉచితంగా ఎక్స్‌రే పరీక్షలు నిర్వహించి, లక్షణాలు ఉన్న వారి కళ్లెన నమూనాలను సేకరించి, నిర్ధారణ అయిన వారికి వెంటనే మందులు అందిస్తున్నట్లు తెలిపారు. అవసరమైన పరీక్షలు, మందులను ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నదని వెల్లడించారు. ఈ శిబిరంలో మొత్తం 216 మందికి ఎక్స్‌రే పరీక్షలు నిర్వహించి నమూనాలు సేకరించారు. కార్యక్రమంలో డాక్టర్ సృజన, సాయి దీప్తి, సూపర్వైజర్లు అశోక్ కుమార్, శ్రీనివాసులు, ఉమ, ఎక్స్‌రే టెక్నీషియన్లు నరేష్, అమన్, వీరేష్ తదితరులు పాల్గొన్నారు.