పయనించే సూర్యుడు ఏప్రిల్ 1, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) కాకినాడ జిల్లాలోని ఎన్టీఆర్ వైద్యసేవ (ఎన్టీఆర్ వి ఎస్) పథకం కింద పనిచేస్తున్న అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు తీవ్రమైన ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో, సంబంధిత అధికారులకు అత్యవసర జోక్యం కోరుతూ సంయుక్తంగా ప్రతినిధి లేఖ సమర్పించాయి. పథకం కింద ఆసుపత్రులకు రావాల్సిన చెల్లింపులు నెలల తరబడి పెండింగ్‌లో ఉండటం, అలాగే ప్యాకేజ్ రేట్లలో ఎలాంటి సవరణలు లేకపోవడం వల్ల ఆసుపత్రుల ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. దీనివల్ల రోగులకు నిరంతర సేవలు అందించడం కష్టసాధ్యంగా మారుతోంది. ఇప్పటికే పలు మార్లు సంబంధిత అధికారులతో చర్చలు జరిపినా, సమస్యల పరిష్కారంలో స్పష్టమైన పురోగతి కనిపించలేదు. పెండింగ్ బకాయిల క్లియరెన్స్, ప్యాకేజ్ రేట్ల సవరణ, భవిష్యత్తులో సమయానికి చెల్లింపులు జరిగేలా హామీ ఇవ్వాలని ఆసుపత్రులు డిమాండ్ చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో తక్షణ చర్యలు తీసుకోకపోతే, ఏప్రిల్ 1 నుండి ఎన్టీఆర్ వైద్యసేవ పథకం కింద సేవలను నిలిపివేయాల్సి వచ్చే పరిస్థితి ఏర్పడిందని ఆసుపత్రుల ప్రతినిధులు తెలిపారు. అయితే, అత్యవసర మరియు కొనసాగుతున్న చికిత్సలు ప్రభావితం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ, సమస్యల పరిష్కారం కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.