
పయనించే సూర్యుడు న్యూస్ 01-04-2026 రిపోర్టర్ అభి కర్నూలు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించకపోవడం భారత రాజ్యాంగం ప్రసాదించిన సమానత్వ హక్కుల ఉల్లంఘనగా పేర్కొంటూ డిహెచ్పిఎస్ కర్నూలు జిల్లా కార్యదర్శి మహేష్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం కోసిగి మండలంలోని సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన డిహెచ్పిఎస్ మండల సమితి సమావేశానికి నియోజకవర్గ కార్యదర్శి ఓంకార్ స్వామి అధ్యక్షత వహించారు. సమావేశంలో మహేష్ మాట్లాడుతూ, మతం మారిన దళితులు సామాజికంగా ఎదుర్కొంటున్న వివక్ష ఒక రోజులో తొలగిపోదని, వారు ఇంకా అణచివేతకు గురవుతున్నారని అన్నారు. దళితులు క్రైస్తవ మతం స్వీకరించినా వారి సామాజిక, ఆర్థిక పరిస్థితుల్లో పెద్దగా మార్పు ఉండదని, అందువల్ల వారికి ఎస్సీ హోదా కల్పించడం అత్యవసరమని అభిప్రాయపడ్డారు. 1950లో అమలులోకి వచ్చిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా ఎస్సీ హోదాను కేవలం హిందూ మతానికి చెందిన దళితులకు మాత్రమే పరిమితం చేయడం అన్యాయమని, అనంతరం సిక్కులు, బౌద్ధులకు కూడా ఈ హోదాను విస్తరించినప్పటికీ క్రైస్తవ దళితులను ఇంకా పక్కన పెట్టడం తగదని విమర్శించారు. ఇది రాజ్యాంగంలోని సమానత్వ సూత్రాలకు విరుద్ధమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యను అత్యంత ప్రాముఖ్యతతో తీసుకుని, దళిత క్రైస్తవులకు కూడా ఎస్సీ హోదా కల్పించేలా తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమాలకు మద్దతు తెలుపుతూ, అవసరమైతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో మండల నాయకులు, సభ్యులు పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.