పయనించే సూర్యుడు న్యూస్ పెద్దపల్లి సెంటినరీ కాలనీ 01 మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఆర్జీ-త్రీ ఏరియా జనరల్ మేనేజర్ సుంకర మధుసూదన్, ఎపిఎ ఏరియా జనరల్ మేనేజర్ కొలిపాక నాగేశ్వరరావు, ఇంచార్జ్ సేవా అధ్యక్షురాలు వెంకటలక్ష్మి నాగేశ్వరరావు అన్నారు. రామగుండం-3, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక కమ్యూనిటీ హాలు నందు నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరైన రామగుండం -3 ఏరియా జనరల్ మేనేజర్ సుంకర మధుసూదన్, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ కొలిపాక నాగేశ్వరరావు, ఇంచార్జ్ సేవా అధ్యక్షురాలు వెంకటలక్ష్మి జ్యోతి ప్రజ్వలన గావించి వేడుకలను ఘనంగా ప్రారంభించారు.అనంతరం అందరికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని, వారిని ఆదర్శంగా తీసుకుని మన పిల్లలను కూడా ప్రోత్సహించాలని సూచించారు. మహిళతోనే మానవ మనుగడ అని, మహిళ సహకారం లేకపోతే ప్రగతి శూన్యం, భూమాతను మించి భారం మోస్తూ, సృష్టికి మూలాధారమైన స్త్రీ మూర్తులని అన్నారు. భార్యగా కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తూనే, ఉద్యోగినిగా సేవలందిస్తున్న మహిళలను అభినందించారు. మహిళలు అన్ని రంగాల్లో ధైర్యంతో, చాకచక్యంతో ముందుకెళ్లాలని కోరారు. సింగరేణి సంస్థ మహిళా సాధికారత కోసం ఎంతో కృషి చేస్తుందని తెలిపారు. పరిసర ప్రాంతాల నిరుద్యోగ యువత కోసం నిర్వహిస్తున్న టైలరింగ్, మగ్గం వర్క్, ఫ్యాషన్ డిజైనింగ్, లాంటి నైపుణాభివృద్ధి శిక్షణా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకొని ఉపాధి అవకాశాలు మెరుగుపరచుకోవాలని అన్నారు. తదుపరి నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో సేవా సభ్యులు, సింగరేణి ఉద్యోగుల కుటుంబ మహిళలు జానపద, సినీ గీతాలతో చేసిన నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి.అనంతరం వివిధ ఆటల పోటీలు, క్విజ్ పోటీలలో గెలుపొందిన మహిళలకు బహుమతి ప్రధానం చేశారు. అలాగే వివిధ విభాగాల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల నాయకులు యం. రామచంద్ర రెడ్డి, కోట రవీందర్ రెడ్డి, అధికారుల సంఘం ఉపాఅధ్యక్షుడు బి.టి.మురళీ కృష్ణ, ఇంచార్జ్ పర్సనల్ విభాగాధిపతి వి.సునీల్ ప్రసాద్, కోఆర్డినేటింగ్ ఆఫీసర్ పి.రాజేశం, సేవా కార్యదర్శి ఆర్.ఉమాదేవి, సంయుక్త కార్యదర్శి బి.అరుణ, మహిళా ఉద్యోగులు, సేవా సభ్యులు, లేడీస్ క్లబ్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.