పయనించే సూర్యుడు 01-04-2026 రాజేష్ దౌల్తాబాద్) దౌల్తాబాద్, మార్చి 31: దౌల్తాబాద్ మండలం ఇందుప్రియల్ గ్రామంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా రథోత్సవం గ్రామంలో అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. శ్రీ సీతారామచంద్రస్వామి ఉత్సవ మూర్తులను అలంకరించిన రథంపై ప్రతిష్ఠించి గ్రామ వీధులలో ఊరేగింపుగా తీసుకువెళ్లారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని "జై శ్రీరాం" నినాదాలతో రథాన్ని లాగుతూ స్వామివారికి తమ భక్తిని చాటుకున్నారు. మహిళలు హారతులు పట్టి స్వాగతం పలకగా, యువకులు ఉత్సాహంగా రథోత్సవాన్ని నిర్వహించారు. గ్రామమంతా భక్తి వాతావరణంతో మార్మోగింది. ఈ ఉత్సవాల్లో భాగంగా యజ్ఞ కార్యక్రమం కూడా ఘనంగా కొనసాగింది. బుధవారం నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమంలో సర్పంచ్ వీరమ్మ స్వాతి స్వామి దంపతులు పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య పూర్ణాహుతి నిర్వహించగా, భక్తులు యజ్ఞశాలలో పాల్గొని స్వామివారిని ప్రార్థించారు. ఈ సందర్భంగా సర్పంచ్ వీరమ్మ స్వాతి మాట్లాడుతూ గ్రామ ప్రజల సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలగాలని దేవుని ప్రార్థించామని తెలిపారు. గ్రామ అభివృద్ధి, రైతుల అభ్యున్నతి, యువతకు మంచి అవకాశాలు కలగాలని ఆకాంక్షించారు. అనంతరం చిన్నారులు చేసిన సాంస్కృతిక న్లృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి కార్యక్రమానికి గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకుని ప్రసాదం స్వీకరించారు.