ఆర్బాటపు ప్రచారాలు తప్ప.. ఆదివాసీలకు ఒరిగిందేమీ లేదు!పీఎం జన్మన్ గృహ నిర్మాణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఘోర వైఫల్యం:సిపీఎం అల్లూరి జిల్లా కమిటీఆగ్రహం

పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ తేదీ 2 రూలర్ రిపోర్టర్ ప్రతినిధి అల్లూరి సీతారామ జిల్లా అరకులోయ మండల కేంద్ర పరిధిలో అత్యంత వెనుకబడిన ఆదివాసీ తెగలు ( పి వి టి జి ) కోసం ఉద్దేశించిన 'పీఎం జన్మన్' పథకం అమలులో కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నాయని సిపీఎం అల్లూరి జిల్లా కమిటీ కార్యదర్శి పి. అప్పల నరస తీవ్రంగా విమర్శించారు. మంగళవారం అరకు పార్టీ జిల్లా కార్యాలయం లో పార్టీ జిల్లా కార్యకర్తల జిల్లా స్థాయి సమావేశంను పార్టీ జిల్లా కమిటీ సభ్యులు వంతలా దాస్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి పి. అప్పల నరస మాట్లాడుతూ, గణాంకాలతో సహా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. అంకెల్లో అసలు నిజాలు - పక్కా ఇళ్ల నిర్మాణంలో… జిల్లాలో మొత్తం 25,578 ఇళ్లు అవసరం ఉండగా, ఇప్పటివరకు పూర్తయినవి కేవలం 589 లోపేనని అప్పల నరస గుర్తుచేశారు. "12,440 ఇళ్ల నిర్మాణం ఇంకా ప్రారంభమే కాలేదు. వేల సంఖ్యలో ఇళ్లు పునాదులు, గోడల దశలోనే ఆగిపోయాయి. జిల్లాకు అవార్డులు వచ్చాయని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది తప్ప, గిరిజనుల ఇళ్ల సమస్యను గాలికొదిలేసింది" అని ఆయన మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఏవై. జి కింద రూ. 2.39 లక్షలు ఇస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా ఎస్టీ సబ్ ప్లాన్ నుండి ఇవ్వాల్సిన రూ. 1 లక్షను ఇప్పటివరకు ఒక్క పైసా కూడా విడుదల చేయకపోవడం గిరిజన ద్రోహమేనని విమర్శించారు. గృహ ప్రవేశాలు చేసిన ఇళ్లకు సంబంధించి దాదాపు రూ. 35 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఇంకా ఉన్నాయి.బిల్లులు రాక మేస్త్రీలు, కూలీలు, మెటీరియల్ సరఫరాదారులు పనులు నిలిపివేశారు. బకాయిలు చెల్లించలేక లబ్ధిదారులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. అట్టహాసపు ప్రకటనలు తప్ప ఆచరణలో మాత్రం చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదు. "ధర్తీ ఆబా జన్ భగీదరి అభియాన్"లో అల్లూరి జిల్లా దేశంలోనే నంబర్ వన్ అని ప్రచారం చేసుకుంటున్న పాలకులు, క్షేత్రస్థాయిలో ఆదివాసీలు గుడిసెల్లో, తాత్కాలిక షెడ్లలో పడుతున్న ఇబ్బందులను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. మార్చి లోపు గృహప్రవేశాలు చేస్తామని ప్రగల్భాలు పలికే అధికారులు, అసలు నిధుల విడుదలపై నోరు మెదపడం లేదని ధ్వజమెత్తారు. ఏప్రిల్ నాటికి పూర్తి నిర్మాణం ప్రారంభం కాని 12,440 ఇళ్లు సహా మిగిలిన అన్ని ఇళ్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ఏప్రిల్ నెలాఖరుకల్లా గృహప్రవేశాలు చేయించాలి. పథకం అమలులో జరుగుతున్న జాప్యం, నిధుల మళ్లింపుపై స్వతంత్ర విచారణ చేపట్టాలి. ఆదివాసీల ఆత్మగౌరవాన్ని, జీవన ప్రమాణాలను దెబ్బతీస్తున్న ఈ ఉదాసీనతను సిపీఎం సహించబోదని, వెంటనే ప్రభుత్వం స్పందించకపోతే జిల్లా వ్యాప్తంగా గిరిజనులను ఏకం చేసి భారీ ఆందోళనలు చేపడతామని అప్పల నరస హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ బి పోతురాజు, వి ఉమామహేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు వివి జయ సిపీఎం అరకు మండల సెక్రటరీ కె. రామారావు పాడేరు మండల కార్యదర్శి సోమల చిట్టిబాబు సాగిన ధర్మానపడాల్ మరియు ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.