పయనించే సూర్యుడు ఏప్రిల్ 02 ,(చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు) మధిర డివిజన్ పరిధిలో ఉపాధి హామీ పథకం కూలీలకు మూడు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి చట్టం ప్రకారం పని చేసిన 14 రోజుల్లోపే కూలీల బ్యాంక్ ఖాతాల్లో వేతనాలు జమ చేయాల్సి ఉన్నప్పటికీ, ఇప్పటివరకు చెల్లింపులు జరగలేదని వారు తెలిపారు. వేతనాలు అందక పస్తులుంటూ జీవనం సాగించడం కష్టమైందని కూలీలు పేర్కొన్నారు. ప్రభుత్వం వద్ద మూడు నెలలుగా డబ్బులు నిల్వ ఉండగా, తమ జీవనోపాధి ఎలా కొనసాగించాలనే ప్రశ్న నిలుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించి, బకాయి వేతనాలను కూలీల ఖాతాల్లో జమ చేయాలని మధిర డివిజన్ వ్యవసాయ కార్మిక సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలను సమీకరించి మండల కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పంగ గోపయ్య, దారెల్లి సురేష్ (ఉప సర్పంచ్, డివిజన్ కన్వీనర్), చెరుకుపల్లి సుందరయ్య (సీపీఎం మాజీ ఉప సర్పంచ్), సీపీఎం యువ నాయకులు మోదుగు సురేష్, మాజీ వార్డు సభ్యుడు ఉసికల నారాయణ, సీపీఎం సెక్రటరీ నోముల నరసింహారావు, కర్రి బాబు, ఉసికల బాబు, గార్లపాటి లక్ష్మి, గార్లపాటి యేసుకర్ణ తదితరులు పాల్గొన్నారు.