పయనించే సూర్యుడు ఏప్రిల్ 2 (సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం ప్రతినిధి స్వాతి.నర్సిములు): జహీరాబాద్ మండలంలోని పస్తాపూర్ పుణ్యక్షేత్రంలో వెలసిన శ్రీ సత్యనారాయణ స్వామి మరియు శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానంలో శ్రీ అయ్యప్ప స్వామి జన్మదిన మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఉత్తరా నక్షత్ర శుభ ఘడియలలో జరిగిన ఈ వేడుకలకు వేలాదిగా భక్తులు మరియు అయ్యప్ప మాలధారులు హాజరయ్యారు.
ఉదయం 8 గంటలకు స్వామివారికి మంగళాభిషేకంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. అనంతరం జరిగిన విశేష అర్చనలు మరియు పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఉదయం 9 గంటలకు నిర్వహించిన స్వామివారి ఊయల సేవలో భక్తులు భజన పాటలు ఆలపిస్తూ పరవశించిపోయారు. ఊయల సేవ అనంతరం, స్వామివారికి పడిపూజ శాస్త్రోక్తంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ నియోజకవర్గ పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని, స్వామివారిని దర్శించుకున్నారు. దేవస్థాన అధికారులు మరియు అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ ఆధ్యాత్మిక వేడుకలు భక్తుల మనస్సులలో చిరస్థాయిగా నిలిచిపోతాయి.
