రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ షాపుల బంద్: చేగుంటలో వ్యాపారుల భారీ ర్యాలీ

పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 2 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి కాశబోయిన మహేష్ మెదక్ జిల్లా, చేగుంట మండలం, ​తెలంగాణ రాష్ట్ర చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా చికెన్ షాపుల బంద్ విజయవంతంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో వ్యాపారులు షాపులు మూసివేసి నిరసన ర్యాలీ నిర్వహించారు. పౌల్ట్రీ కంపెనీలు రిటైల్ వ్యాపారులకు ఇచ్చే మార్జిన్‌ను భారీగా తగ్గించడం వల్ల తాము తీవ్ర నష్టాల్లో ఉన్నామని, దుకాణాల అద్దెలు, కరెంటు బిల్లులు, కార్మికుల జీతాలు చెల్లించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ర్యాలీకి చేగుంట ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీ, కాంగ్రెస్ నాయకులు సండ్రుగు సతీష్, వార్డు సభ్యులు ఆరిఫ్ తమ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ రఫీ మాట్లాడుతూ.. సామాన్యుల ఆహార అలవాట్లలో కీలకమైన చికెన్ విక్రయాలపై ఆధారపడి వేలాది కుటుంబాలు జీవిస్తున్నాయని, కంపెనీల ఏకపక్ష నిర్ణయాల వల్ల చిన్న వ్యాపారులు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కంపెనీలతో మాట్లాడి వ్యాపారులకు న్యాయమైన మార్జిన్ దక్కేలా చూడాలని డిమాండ్ చేశారు. షాపు యజమాని షకిల్ మాట్లాడుతూ.. రవాణా ఖర్చులు పెరిగినా కంపెనీలు తమకు ఇచ్చే కమీషన్ పెంచకపోవడం అన్యాయమని, న్యాయం జరిగే వరకు పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వ్యాపారులు మహమ్మద్ సలీం, మహమ్మద్ కలీం, హామీద్, కటిక శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *