ఏఐఎస్ఎఫ్ పోరాటం ఫలితం… కోసిగిలో ఏపీ మోడల్ స్కూల్ సీసీ రోడ్డు పనులు ప్రారంభం

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 03 రిపోర్టర్ అభి కోసిగి మండలంలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) పోరాటానికి ఫలితం దక్కింది. ఏపీ మోడల్ స్కూల్‌కు వెళ్లే మార్గంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమవడంతో విద్యార్థి సంఘం నాయకులు గురువారం పనులను పరిశీలించారు. గత కొంతకాలంగా పాఠశాలకు వెళ్లే రహదారి అధ్వాన్నంగా మారి విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను గుర్తించిన ఏఐఎస్ఎఫ్ నాయకులు నిరంతరం ఉద్యమాలు చేపట్టి ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారి కృషితోనే చివరకు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరై పనులు ప్రారంభమైనట్లు నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు యస్. ఈరేష్, మండల కార్యదర్శి అంజి మాట్లాడుతూ విద్యార్థుల సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. రోడ్డు పనులు ప్రారంభం కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూనే, నిర్మాణంలో నాణ్యత విషయంలో రాజీ పడకూడదని హెచ్చరించారు. పరిశీలనలో భాగంగా రోడ్డు పనుల్లో నాణ్యత లోపాలు ఉన్నట్లు గమనించిన నాయకులు కాంట్రాక్టర్ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రోడ్డు ఇరువైపులా సరైన విస్తీర్ణంతో నిర్మాణం చేపట్టేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. పనుల్లో నిర్లక్ష్యం వహించినా, నాణ్యత లోపించినా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పనులను అడ్డుకుని పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని స్పష్టం చేశారు. రోడ్డు నిర్మాణానికి స్పందించిన ప్రజా ప్రతినిధులు, అధికారులకు ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ నాయకులు ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో కూడా విద్యార్థుల సమస్యల పరిష్కారానికి తమ పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల నాయకులు హనుమంతు, విజయ్, కుమార్, మల్లికార్జున, రాము, మహిళా కన్వీనర్లు సుప్రియ, సనా, సంధ్య, రష్మికతో పాటు విద్యార్థినులు పాల్గొన్నారు.