పయనించే సూర్యుడు ఏప్రిల్ 3 (సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం ప్రతినిధి స్వాతి.నర్సిములు): : ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక వార్డు సభల్లో భాగంగా జహీరాబాద్ మున్సిపల్ కార్యాలయ ఆవరణలో గురువారం నిర్వహించిన సభలో 27వ వార్డు కౌన్సిలర్ నామ స్రవంతి ప్రజల పక్షాన గళమెత్తారు. ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలులో జరుగుతున్న తీవ్ర జాప్యంపై ఆమె అధికారులను, పాలక పక్షాన్ని సూటిగా నిలదీశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంధించిన బహిరంగ లేఖను ఆమె విడుదల చేస్తూ, ఎన్నికల వేళ ఇచ్చిన అభయహస్తం హామీలు నేడు అటకెక్కాయని తీవ్రంగా విమర్శించారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు మరియు పేదలు తమ హక్కుల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి మహిళకు నెలకు అందిస్తామన్న రెండు వేల ఐదు వందల రూపాయల నగదు సాయం ఇప్పటికీ అందకపోవడం మహిళా లోకాన్ని వంచించడమేనని ఆమె మండిపడ్డారు. జహీరాబాద్ పురపాలక సంఘం పరిధిలో వెయ్యికి పైగా వితంతు, వృద్ధాప్య మరియు వికలాంగుల పింఛన్లు పెండింగ్లో ఉన్నాయని, వాటిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా, తొలినాళ్లలో అందిన ఉచిత విద్యుత్ పథకం ప్రస్తుతం సాంకేతిక కారణాల సాకుతో చాలా మందికి అందడం లేదని ఆమె ధ్వజమెత్తారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో స్పష్టత లేదని, ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ రాయితీ సొమ్ము లబ్ధిదారుల ఖాతాల్లో జమ కావడం లేదని నిలదీశారు. గత ప్రభుత్వం అందించిన దానికంటే అదనంగా ఇస్తామన్న తులం బంగారం హామీ ఎప్పుడు నెరవేరుతుందని ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వార్డు సభల పేరుతో కాలయాపన చేయకుండా, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని ఆమె అధికారులను కోరారు. 27వ వార్డు ప్రజల ప్రతినిధిగా వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం తన బాధ్యత అని, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే ఊరుకునేది లేదని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో 32వ వార్డు కౌన్సిలర్ సుజిత విశ్వేశ్వర్ మరియు ప్రజలు పాల్గొన్నారు.