శబరిమల వీధుల్లో ‘కడియపులంక’ పూల పరిమళం

ఆరాట్టు ఉత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన మాలలు

పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 03 అనపర్తి నియోజకవర్గం ఇంచార్జ్ సురేష్ విశ్వవిఖ్యాత పుణ్యక్షేత్రం శబరిమలలో జరిగిన అయ్యప్ప స్వామి వారి ‘ఆరాట్టు’ మహోత్సవంలో ఆంధ్రప్రదేశ్‌లోని కడియపులంక పూల మాలలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కడియం మండలం కడియపులంకకు చెందిన ప్రముఖ పూల వ్యాపారి, జనసేన నాయకుడు ఆకుల భాస్కరరావు ఆధ్వర్యంలో రూపొందించిన ఈ మాలలు స్వామి వారి గ్రామ ఉత్సవంలో హైలైట్‌గా నిలిచాయి.కనువిందు చేసిన చామంతి మాలలు:ఈ ఉత్సవం కోసం ప్రత్యేకంగా తెలుపు, పసుపు రంగుల క్రిసంథం (చామంతి) పూలతో అద్భుతమైన మాలలను తయారు చేయించారు. గజరాజుపై అయ్యప్ప స్వామి వారిని ఊరేగిస్తున్న సమయంలో, పదునెనిమిది మెట్ల నుంచి పంబా గణపతి వరకు ఈ మాలలతోనే స్వామి వారిని అలంకరించారు. కడియపులంక పూల నైపుణ్యం, ఆ మాలల అందం శబరిమల ఆలయ పూజారులను, దేశ విదేశాల నుంచి వచ్చిన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.ఏటా కొనసాగుతున్న సంప్రదాయం:ప్రతి ఏడూ అయ్యప్ప స్వామి జన్మదినం సందర్భంగా జరిగే ఆరాట్టు మహోత్సవానికి ఆకుల భాస్కరరావు తన బృందంతో కలిసి వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా మరో ఆరుగురు భక్తులతో కలిసి వెళ్లిన ఆయన, తమ ఊరి పూల మాలలతో స్వామి వారిని అలంకరించడం ఎంతో గర్వంగా, ఆనందంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కడియపులంక పూల ఖ్యాతిని శబరిమల గిరుల్లో చాటిన భాస్కరరావు బృందాన్ని స్థానికులు అభినందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *