99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ఇల్లంతకుంటలో గ్రామ సభ ఘనంగా నిర్వహణ

పయనించే సూర్యుడు న్యూస్ : ఏప్రిల్/03 :నియోజకవర్గం స్టాప్ ప్రతినిధి :సాయిరెడ్డి బొల్లం :రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 99 రోజుల “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో భాగంగా గురువారం గ్రామ సభను ఘనంగా నిర్వహించారు. స్థానిక రైతు వేదికలో జరిగిన.ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ ఎం.రాజు మరియు పాలకవర్గం ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమానికి జిల్లా స్పెషల్ ఆఫీసర్ పరిమళ దేవి, మండల ప్రత్యేక అధికారి రామకృష్ణ హాజరై గ్రామ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు వాటి అమలు విధానంపై అధికారులు ప్రజలకు వివరించారు. గ్రామ సభలో ప్రజలు పెండింగ్‌లో ఉన్న సంక్షేమ పథకాల దరఖాస్తులు, పింఛన్లు, రేషన్ కార్డులు, ఇండ్ల పథకాలు, రైతు సమస్యలకు సంబంధించిన వినతిపత్రాలను సమర్పించారు. గ్రామంలో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, వీధి దీపాలు వంటి మౌలిక వసతుల సమస్యలను కూడా ప్రజలు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. రెవెన్యూ సంబంధిత భూమి సమస్యలు, పాస్‌బుక్‌లు, సర్వే అంశాలపై కూడా ప్రజలు తమ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి దరఖాస్తును పరిశీలించి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గ్రామ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఎం.రాజు మాట్లాడుతూ మానకొండూరు శాసన సభ్యులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ, ఇల్లంతకుంట గ్రామ పంచాయతీకి కేటాయించిన నిధులతో గ్రామంలో చేపట్టిన రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సదుపాయాలు, వీధి దీపాలు మరియు ఇతర మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించడం జరిగింది. ఇక ముందు కూడా ఎమ్మెల్యే, సహకారంతో ఇల్లంతకుంట గ్రామ అభివృద్ధి పనులు మరింత వేగవంతం చేస్తామని తెలిపారు. గ్రామ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మూగు నాగరాజ్ శర్మ, వార్డు సభ్యులు దయ్యాల శ్రీలత-మహేష్, రేగుల కార్తీక్, ఎర్రోజు దీపిక-రవితేజ, మామిడి సుశీల, మామిడి శ్రీనివాస్, చేరాల వంశీకృష్ణ, రాకం సుమన్, కొట్టే ప్రమీల-వెంకటి, అంతటి శ్రీకాంత్ గౌడ్, కునబోయిన ఎల్లవ్వ-దేవయ్య, కునబోయిన రఘు, జీపీవో కవిత, కార్యదర్శి చంద్రశేఖర్, మండల స్థాయి అధికారులు, సెస్ అధికారులు, రెవెన్యూ సిబ్బంది, గ్రామ పంచాయతీ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, రైతులు, మహిళలు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు