అంబేద్కర్ విగ్రహంపై పంతం – వెనక్కి తగ్గేదే లేదని ప్రజా సంఘాల గర్జన!

బాలానగర్ చౌరస్తాలో రౌండ్ టేబుల్ సమావేశం.. ఎంఆర్వో ఆఫీసు వద్ద విగ్రహం పెడితే సహించేది లేదు!

పయనించే సూర్యుడు : ఏప్రిల్ 4 జడ్చర్ల తాలూకా బాలనగర్ మండల రిపోర్టర్ రేవల్లి కృష్ణ బాలానగర్, ఏప్రిల్ 3: “జాతి గర్వించదగ్గ మహనీయుడు, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కు ఇచ్చే గౌరవం ఇదేనా?” అంటూ బాలానగర్ ప్రజా సంఘాలు నిప్పులు చెరిగాయి. అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై మండిపడుతూ, ఈరోజు నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం రణక్షేత్రంగా మారింది. బాలానగర్ చౌరస్తా నుంచి ఫ్లైఓవర్ కింది భాగంలో విగ్రహాన్ని ప్రతిష్టించాలి. లేదంటే వెటర్నరీ హాస్పిటల్ దగ్గర ఉన్న 10 గుంటల భూమిని కేటాయించి, అక్కడ సముచిత రీతిలో విగ్రహాన్ని నెలకొల్పాలి. ఎంఆర్వో ఆఫీసు వద్ద వద్దు.. అది అవమానమే! “అంబేద్కర్ అంటే ఒక ఆఫీసు మూలనో, గోడ పక్కనో పెట్టే విగ్రహం కాదు.. ఆయన ఈ దేశపు వెలుగు. ఎంఆర్వో ఆఫీసు వద్ద మొక్కుబడిగా విగ్రహం పెట్టి చేతులు దులుపుకుంటామంటే చూస్తూ ఊరుకోం. అది ఆ మహనీయుడిని అవమానించడమే” అని నాయకులు ఉద్వేగంతో హెచ్చరించారు. సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిలోనూ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. “మా కోరిక న్యాయమైనది. గౌరవప్రదమైన స్థలంలో విగ్రహం పెట్టకపోతే, బాలానగర్ గడ్డపై మరో చారిత్రాత్మక ఉద్యమాన్ని చూస్తారు. మా రక్తంలో ప్రవహిస్తున్న అంబేద్కర్ ఆశయాల సాక్షిగా చెబుతున్నాం.. మా డిమాండ్లు నెరవేరే వరకు విశ్రమించేది లేదు. అవసరమైతే ప్రాణాలకైనా సిద్ధం!” అని గర్జించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నేతలు, దళిత బహుజన నాయకులు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. అధికారులు వెంటనే స్పందించకపోతే రాబోయే రోజుల్లో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని అల్టిమేటం జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *