
పయనించే సూర్యుడు, ఏప్రిల్ 4, మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్ నరిగె కళా శేఖర్: మారిపోతున్న జీవనశైలిలో భాగంగా మన పూర్వీకుల ఆరోగ్య రహస్యమైన ‘చద్దన్నం’ ప్రాముఖ్యతను నేటి తరానికి అందించడం అభినందనీయమని ప్రముఖ తెలంగాణ సినీ జానపద నటుడు, కొరియోగ్రాఫర్ దండేపల్లి శ్రీనివాస్ అన్నారు. జడ్చర్లలోని ‘సాస్ చద్దన్నం’ టిఫిన్ సెంటర్‌ను ఆయన శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి వంటకాలను రుచి చూసిన ఆయన, “తాతల నాటి చద్దన్నం భలే బాగుంది” అంటూ ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నేటి కాలంలో ఫాస్ట్ ఫుడ్ సంస్కృతికి అలవాటు పడి మన వారసత్వ వంటలను పూర్తిగా మర్చిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి తరుణంలో చిరుధాన్యాల వంటకాలకు మళ్లీ పునరుజ్జీవం పోయడం శుభపరిణామన్నారు. ప్రజలందరూ నిండు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలంటే ఇలాంటి ప్రకృతి సిద్ధమైన ఆహారాన్ని అలవాటు చేసుకోవాలని ఆయన కోరారు.ముఖ్యంగా జిమ్ కి వెళ్లేవారు, మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేసే యువత మాంసాహారం కంటే చిరుధాన్యాలకు ప్రాముఖ్యత ఇస్తే ఆశించిన ఫిట్నెస్ లభిస్తుందని ఆయన సూచించారు. టిఫిన్ సెంటర్ నిర్వాహకుడు కాశీదాస్ గురించి ప్రస్తావిస్తూ.. ఒక కవిగా, గాయకుడిగా ఉండి కూడా సమాజ ఆరోగ్యం పట్ల బాధ్యతతో ఈ రంగాన్ని ఎంచుకోవడం ఆయనలోని సామాజిక స్పృహకు నిదర్శనమని అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానికులు మరియు కళాకారులు పాల్గొన్నారు.