పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 7 అశ్వారావుపేట మండలం రిపోర్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో ఏజెన్సీ చట్టాలను తుంగలో తొక్కి, పేద గిరిజనులకు దక్కాల్సిన భూములను గిరిజనేతరులు కాజేస్తున్న వైనం అశ్వారావుపేట మండలంలో వెలుగుచూసింది. తిరుమలకుంట రెవెన్యూ గ్రామ పరిధిలో జరుగుతున్న ఈ భూ అక్రమాలపై అశ్వారావుపేట ఆదివాసీ గిరిజన సంక్షేమ సంఘం మండల కమిటీ సమరశంఖం పూరించింది. సంఘం అధ్యక్షులు పాయం దుర్గారావు నేతృత్వంలో సోమవారం తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆదివాసి సంఘం నేతలు తెలిపిన వివరాల ప్రకారం తిరుమలకుంట రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 631/36 లో సుమారు 10.00 ఎకరాల భూమి ములకలపల్లి మండలం గండిప్రోలు గ్రామానికి చెందిన పాయం వెంకయ్య తండ్రి ముత్తప్ప అను గిరిజనుడికి కేటాయించబడింది. అయితే, ఆ భూమిపై ఎటువంటి హక్కులు లేని ఇతరుల పేర్లతో దొంగ పట్టాలు సృష్టించి, తప్పుడు మార్గాల్లో గిరిజనేతరులకు విక్రయించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. 1/70 చట్టం మరియు ఏజెన్సీ నిబంధనల ప్రకారం గిరిజన ప్రాంతాల్లోని భూమిని గిరిజనేతరులకు విక్రయించడం లేదా బదలాయించడం పూర్తిగా నిషిద్ధం. కానీ, తిరుమలకుంటలో ఈ 10 ఎకరాల భూమిని పాయం వెంకయ్య నుండి గిరిజనేతరుడైన పానుగంటి శ్రీను తండ్రి సత్యనారాయణ అనే వ్యక్తికి అక్రమంగా విక్రయించారని, ఇది చట్ట విరుద్ధమని పాయం దుర్గారావు పేర్కొన్నారు. గిరిజన భూములను కాపాడాల్సిన రెవెన్యూ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. విక్రయాలు నిలిపివేయాల్సింది పోయి, రికార్డుల్లో మార్పులు చేర్పులు జరగడం వెనుక భారీ కుట్ర దాగి ఉందని సంఘం నాయకులు ఆయన దుర్గారావు మండిపడ్డారు. గిరిజనులకు చెందాల్సిన భూములను అక్రమంగా అనుభవిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అక్రమంగా జరిగిన భూ క్రయవిక్రయాలను వెంటనే రద్దు చేయాలని, సదరు 10 ఎకరాల భూమిని సర్వే చేయించి, అర్హులైన ఆదివాసీ గిరిజనులకే అప్పగించాలని, 1/70 చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసి, అక్రమార్కులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదివాసి సంఘం అధ్యక్షులు పాయం దుర్గారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు మరియు గిరిజన రైతులు పాల్గొని, తమకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు.