పయనించే సూర్యుడు 7-4-2026 గొల్లపెల్లి మండల రిపోర్టర్ (ఆవుల చందు ) జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం ఉమ్మడి వెల్గటూర్ మండల మాజీ వైస్ ఎంపీపీ మామిడిపల్లి విజయ ప్రసాద్ సోమవారం కాంగ్రెస్ పార్టీని వీడి, బిజెపి పార్టీలో చేరి కాషాయ కండువా కప్పుకున్నారు. భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అంబారిపేటలో ఏర్పాటుచేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో మామిడిపల్లి ప్రసాద్ సుమారుగా 100 మంది తన అనుచరులతో కలిసి బిజెపి పార్టీలో చేరారు. భారతీయ జనతా పార్టీ ధర్మపురి నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ కొమ్ము రాంబాబు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మామిడిపల్లి ప్రసాద్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం చేపట్టినప్పటి నుండి పెట్టుబడిదారుల గుత్తాధిపత్యంలో కొనసాగుతుందే తప్ప పార్టీకి అంకితభావంతో పనిచేసిన కార్యకర్తలకు గుర్తింపు లేదని, అందుకే కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు వెల్లడించారు. 46 ఏళ్ల క్రితం కేవలం రెండు పార్లమెంటు సీట్లతో ప్రారంభమైన భారతీయ జనతా పార్టీ నేడు మూడు దఫాలుగా కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో అధికారం చేపట్టడం హర్షనీయమని, గ్రామాల అభివృద్ధి బిజెపి పార్టీతోనే సాధ్యమని, నరేంద్ర మోడీ పరిపాలనకు ఆకర్షితుడనై బిజెపి పార్టీలో చేరానని పేర్కొన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో ఉమ్మడి వెల్గటూర్ మండలంలో బిజెపి పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం తన వంతు కృషి చేస్తానని, రాబోయే రోజుల్లో రాష్ట్రంలో అధికారం చేపట్టేది బిజెపి పార్టీయేనని మామిడిపల్లి ప్రసాద్ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో బిజెపి ఎండపల్లి మండల పార్టీ అధ్యక్షుడు రావు హన్మంతరావు, నాయకులు తిరుమల ప్రమోద్ గౌడ్, మంచికట్ల రవి, గోపినవేని గంగాచలం యాదవ్, మామిడిపల్లి రమేష్, ముచ్చర్ల రాజు, ఎర్రోజు శ్రీనివాస్, మామిడిపల్లి మధుకర్, మెడపట్ల శిరీష్, మామిడిపల్లి సత్తయ్య, ఆరేల్లి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.