రక్షణ రంగంలో ‘న్యూక్లియనిక్స్’ సరికొత్త రికార్డు

* దేశీయ విమానాశ్రయాల్లో అణు భద్రత పరికరాల ఏర్పాటు * సంస్థ సీఎండీ జె. నరేందర్ రెడ్డి వెల్లడి

పయనించే సూర్యడు / ఏప్రిల్ 07/ ఉప్పల్ ప్రతినిధి సింగం రాజు : దేశ రక్షణ రంగం, అణుశక్తి సంస్థలు, విమానాశ్రయాలు మరియు ఓడరేవులలో అణు భద్రత పరికరాలను అమర్చే కీలక ఆర్డర్లను న్యూక్లియనిక్స్ సంస్థ దక్కించుకుందని ఆ సంస్థ సీఎండీ జె. నరేందర్ రెడ్డి తెలిపారు. సోమవారం చర్లపల్లి ఐడీఏలోని పారిశ్రామికవేత్తల భవనంలో నిర్వహించిన ‘న్యూక్లియనిక్స్ సక్సెస్ మీట్’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలోని అత్యంత కీలకమైన విభాగాలకు అణు రక్షణ పరికరాలను అందించడంలో తమ సంస్థ ఉద్యోగులు, సిబ్బంది కృషి అభినందనీయమన్నారు. ఇప్పటికే మొదటి దశలో భాగంగా వివిధ విమానాశ్రయాల్లో 170 అత్యాధునిక పరికరాలను అమర్చామని, రెండో దశలో మరో 400 పరికరాలను ఏర్పాటు చేయనున్నామని వివరించారు. సంస్థ డైరెక్టర్లు జె. నిశాంత్ రెడ్డి, జె. ధీరజ్ రెడ్డి మాట్లాడుతూ.. అణు భద్రత పరికరాల ఉత్పాదకతను పెంచడంతో పాటు అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాలను పాటిస్తున్నామని చెప్పారు. త్వరలోనే అత్యధిక సంఖ్యలో అణు శక్తి పరికరాలను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆడిటర్లు ప్రదీప్ నారాయణ, అంకిత, జైనిక్ మరియు సంస్థ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *