సీబీఎస్‌ఈలో కీలక మార్పు.. ఇకపై మూడు భాషల విధానం తప్పనిసరి

పయనించే సూర్యుడు; తేదీ: 7 మంగళవారం, ఏప్రిల్ 2026. పాత్రికేయులు, ఆడెపు సంతోష్ కుమార్; మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా. “ద సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్” (సీబీఎస్‌ఈ) విద్యా విధానంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి మూడు భాషల విధానాన్ని అమలు చేయబోతుంది. 2031 నాటికి పదో తరగతిలో కూడా మూడు భాషల విధానం అమలయ్యేలా ఈ మార్పు చేపట్టింది. అయితే, ఒకేసారి 2031లో అమలు చేయడం కాకుండా, ఇందుకోసం ఇప్పటినుంచే త్రిభాషా విధానాన్ని అమలు చేయబోతుంది. ఈ విద్యా సంవత్సరం నుంచి ఆరో తరగతిలో మూడు భాషల విధానం అమలవుతుంది. 2026-27కు సంబంధించి, ఆరో తరగతికి, 2027-28లో ఏడో తరగతికి, 2028-29లో ఎనిమిదో తరగతికి, 2029-30 నాటికి తొమ్మిదో తరగతికి, 2030-31 నాటికి పదో తరగతికి మూడు భాషల విధానాన్ని అమలు చేయలని సీబీఎస్‌ఈ నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆరో తరగతి చదివే వారు మూడు భాషలు చదవాల్సి ఉంటుంది. ఇకపై పదో తరగతి వరకు ప్రతిఏటా ఇలాగే ఈ విధానం అమలవుతుంది. ప్రస్తుతం సీబీఎస్‌ఈలో రెండు భాషల విధానమే అమలవుతున్న సంగతి తెలిసిందే. ఇంగ్లీష్‌తోపాటు మరో ప్రాంతీయ భాషను మాత్రమే అమలు చేస్తున్నారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్‌ఈపీ) 2020లో వచ్చిన సూచనలకు అనుగుణంగా ఈ మార్పు తీసుకొచ్చింది సీబీఎస్‌ఈ బోర్డు. బహుభాషా విధానం వల్ల ఉపయోగం ఉంటుందనేది దీని ఉద్దేశం. భారతీయ భాషలకు ఆదరణ కూడా పెరుగుతుందని ప్రభుత్వం కూడా విశ్వసిస్తోంది. కొత్త విధానంలో ప్రస్తుతం ఏడో తరగతి, ఆపై తరగతులు చదువుతున్న వారికి మాత్రం మూడు భాషలు ఉండవు. రెండు లాంగ్వెజెస్ మాత్రమే చదువుకోవాలి. ప్రస్తుతం ఆరో తరగతికి మాత్రమే మూడు భాషలకు సంబంధించిన పాఠ్య పుస్తకాల్ని అందించబోతున్నట్లు సీబీఎస్‌ఈ చైర్మన్ రాహుల్ సింగ్ తెలిపారు. వీరు 2031లో మూడు భాషలతో బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తారు. కొత్త విధానంలో ఏదైనా ఒక్క విదేశీ భాషను మాత్రమే నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ మంది ఇంగ్లీష్ మాత్రమే ఎంచుకుంటారు. కాబట్టి, మరో విదేశీ భాషకు అవకాశం లేదు. థర్డ్ లాంగ్వెజ్‌ను ఆన్‌లైన్‌లో కూడా నేర్పించే ఏర్పాట్లు చేస్తోంది సీబీఎస్‌ఈ. రాబోయే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థుల స్కిల్స్ పెంచే కొత్త సబ్జెక్టులు కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *