కార్పొరేట్‌’కు కొమ్ముకాస్తున్న కేంద్రం : సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం.

పయనించే సూర్యుడు న్యూస్ మర్రిగూడ ఏప్రిల్ 08. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌ శక్తులకు కొమ్ముకాస్తోందని ఎమ్మెల్సీ, సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం అన్నారు. సోమవారం మర్రిగూడ మండల కేంద్రంలో నిర్వహించిన పార్టీ కౌన్సిల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కార్పొరేట్‌ శక్తులకు కొమ్ముకాస్తూ దేశ సంపదను దోచిపెడుతోందన్నారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలు అవుతుందన్నారు. నిత్యావసర ధరల పెరుగుదల, నిరుద్యోగం, అప్పులు వంటి అంశాలతో దేశం తీవ్ర సంక్షోభంలో నెట్టబడిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలన్నారు. ఉమ్మడి జిల్లాలో పెండింగ్‌ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలన్నారు. సమావేశంలో జిల్లా కౌన్సిల్‌ సభ్యుడు ఈదుల భిక్షంరెడ్డి, మండల కన్వీనర్‌ బుర్ర శేఖర్‌, నాయకులు కల్లెట్ల లింగయ్య, చలం పాండు, ఎరుకల నిరంజన్‌, జక్కల అంయ్య, మాద సత్యం, బొల్లం యాదయ్య, రామిడి భూపతిరెడ్డి, కొట్టం యాదయ్య, బాలకిషన్‌, అల్వాల నరసింహ తదితరులు పాల్గొన్నారు.