పయనించే సూర్యుడు ఏప్రిల్ 08. ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఖమ్మం జిల్లా వైరా మండలం: గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబనకు తోడ్పడే డ్వాక్రా సంఘాల్లో మరో అవినీతి ఘటన వెలుగులోకి వచ్చింది.వైరా మండలం నారపునేనిపల్లి గ్రామానికి చెందిన డ్వాక్రా మహిళల గ్రూపులకు సంబంధించిన సుమారు రూ. 20 లక్షల నిధులను గ్రామ దీపిక అక్రమంగా ఎత్తుకెళ్లిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది గ్రామానికి చెందిన పొదుపు సంఘాల మహిళలు ఇచ్చిన సమాచారం మేరకు, గ్రామంలోని ఇరువై రెండు గ్రూపులకు సంబందించిన డ్వాక్రా సంఘాల మహిళలు తమ పొదుపు నిధులను మరియు బ్యాంకు లావాదేవీల బాధ్యతలను గ్రామ దీపిక అయిన బొల్లినేని హేమకు అప్పగించారు. అయితే గ్రూపులకు సంబంధించిన డబ్బులను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయకుండా ఆ నిధులను తన వ్యక్తిగత అవసరాల కోసం దాదాపు ఇరువై లక్షల రూపాయలు దుర్వినియోగం చేసినట్లు మహిళలు ఆరోపిస్తున్నారు. ఇటీవల అధికారులు ఖాతాలను పరిశీలించగా అసమానతలు బయటపడడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది దీంతో కంగారు పడిన గ్రూపు సభ్యులు సదరు గ్రామదీపికకు పోన్లు చేసి వివరణ కోరగా పొంతనలేని సమాధానాలు చెబుతూ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో దిక్కు తోచని స్థితిలో డ్వాక్రా మహిళలు కొట్టుమిట్టాడుతున్నారు,అంతే కాకుండా కొంతమంది గ్రూపు సభ్యుల అమాయకత్వాన్ని అడ్డం పెట్టుకుని ఫోర్జరీ సంతకాలతో వారికి తెలియకుండానే వారి పేరు మీద లోన్లు తీసుకున్న ఘటనలు కూడా ఉన్నట్లు మహిళా సంఘాలు తెలిపాయి,దీంతో గత కొన్ని నెలలుగా గ్రూపు సభ్యులు తీసుకున్న రుణాల డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమ చేయక పోవడంతో స్థానిక ఏపీఎం వెంటనే డబ్బులు చెల్లించాలంటూ గ్రూపు సభ్యులకు నోటీసులు జారీ చేయడంతో లబో దిబో మంటున్నారు ఈ మొత్తం వ్యవహారంలో కీలకంగా వ్యవహరించి, మహిళలను నమ్మించి వారి సొమ్ముతో పరారైన గ్రామదీపికపై బాధిత మహిళలు అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. తమ కష్టార్జిత ధనాన్ని తిరిగి ఇప్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గ్రామంలో ఈ ఘటనపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.ఈ విషయంపై సంబంధిత అధికారులతో మాట్లాడగా ఈ విషయం మీద ఎటువంటి పిర్యాదు అందలేదని,పిర్యాదు అందాక నిధుల దుర్వినియోగం నిర్ధారణ అయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు,ఈ ఘటనతో డ్వాక్రా సంఘాలపై విశ్వాసం దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు