
పయనించే సూర్యుడు న్యూస్: కడప ఏప్రిల్: 8 పన్ను వసూలులో లక్షల బకాయిలు ఉన్న సంపన్నులను వదిలేసి సామాన్యులను పీడిస్తున్న మున్సిపల్ / కార్పొరేషన్ అధికారుల వైఖరిని నిరసిస్తూ అఖిలపక్ష పార్టీ ప్రజాసంఘాలు తలపెట్టిన జిల్లా వ్యాప్త ఆందోళనలో భాగంగా మంగళవారం స్థానిక కడప కార్పొరేషన్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మేయర్ పాకా సురేష్, సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, సిపిఎం నగర కార్యదర్శి రామ్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ అలీ ఖాన్, జేవి రమణ, సంగటి మనోహర్, దస్తగిరి, ఎస్కే మైనుద్దీన్, అమీన్ పీర్, మాజీ కార్పొరేటర్ లు సమ్మెట బసవరాజు, షఫీ, అజమతుల్లా , రామకృష్ణారెడ్డి, సుబ్బరాయుడు, రామచంద్రయ్య తదితరులు మాట్లాడుతూ స్థానిక సంస్థలు స్వయం పరిపాలన దిశగా నిధులు, విధులు చట్టబద్ధత కల్పిస్తూ రాజ్యాంగం ఇచ్చిన హక్కును అధికారులు అధికార పార్టీ నేతలు ఉల్లంఘిస్తున్నారని వారు ఆరోపించారు. జిల్లాలో ఇంటి పన్ను నీటి పన్ను ఖాళీ స్థలాల పన్ను వసూలులో లక్షల బకాయిలు ఉన్న సంపన్న వర్గాల జోలికి పోకుండా సామాన్యులను పీడించి కుళాయి కనెక్షన్ కట్ చేస్తామంటూ, ఇంటికి తాళాలు వేస్తామంటూ ఫైనాన్స్ కంపెనీల కంటే అద్వానంగా వ్యాపార సంస్థలను తలదన్నే విధంగా మున్సిపల్ అధికారులు వ్యవహరించారన్నారు. ఇంత ఒత్తిడి చేసి వసువులైన జనరల్ ఫండ్ ను తిరిగి జనం కోసం మౌలిక సదుపాయాలైన రోడ్లు కాలువలు వీధిలైట్లు త్రాగునీటి వసతి కల్పనకు ఖర్చు చేయడంలో శ్రద్ధ పెట్టడం లేదన్నారు. మురికివాడల్లో మౌలిక సమస్యలతో వేసవి ఆరంభంలోనే గుక్కెడు మంచినీటి కోసం కటకటా అనాల్సి వస్తుందన్నారు. చిన్నపాటి వర్షాలకే బయటికి పోయే మార్గాలు లేక మురికి కూపాలుగా మారి, దోమలకు నిలయాలై చికెన్ గున్యా డెంగ్యూ మలేరియా లాంటి విష జ్వరాల బారినబడి ఆసుపత్రుల చుట్టూ తిరిగి అప్పులపలై ఉన్న ఇంటిని కూడా అమ్ముకునే దుస్థితి నెలకొన్నది అన్నారు. గత పాలకవర్గంలో 15 ఫైనాన్స్ నిధులను ఖర్చు చేసేందుకు తీర్మానం చేసి, టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాల్సిన సమయంలో అధికార పార్టీ నేతల జోక్యంతో టెండర్లను రద్దు చేసిన చరిత్ర కడప కార్పొరేషన్ కి దక్కుతుందన్నారు. జనం నుండి వసూలు చేసిన జనరల్ ఫండ్ ను జనావాసాల్లో కాకుండా సంపన్న వర్గాల ఆర్థిక ప్రయోజనాల కోసం వెంచర్లలో ఖర్చు చేస్తున్నారని వారు ఆరోపించారు. లక్షల నుండి కోట్లలో బకాయిలు ఉన్న సంపన్నుల జోలికి ఎందుకు పోవడం లేదని నగరపాలక సంస్థ అధికారులు నిలదీశారు. ప్రభుత్వ రంగ సంస్థలైన రెవిన్యూ, పోలీస్, ఆర్ అండ్ బి, రైల్వే, ఆర్టీసీ, ఎలక్ట్రిసిటీ లాంటి సంస్థలు లక్షల బకాయిలు పేరుకుపోయినప్పటికీ వసూలులో ఎందుకు జాబ్ ఏం చేస్తున్నారని వారు నిలదీశారు. ప్రభుత్వం నుండి బిపిఎస్, మ్యుటేషన్, అమృత్, స్టాంప్ డ్యూటీ ఫీజు బకాయిలు చెల్లించకుండా నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. మున్సిపల్ /కార్పొరేషన్ పాలకవర్గం గడువు ముగియడంతో పోటీపడి పన్ను వసూలు చేసి వచ్చిన జనరల్ ఫండ్ ను అధికారులు అధికార పార్టీ నేతలు ఇస్తారాజ్యంగా ఖర్చు చేయడానికి పక్కా ప్రణాళిక రూపొందించుకున్నారని వారు విమర్శించారు. వివిధ విభాగాలలో అధికార పార్టీ నేతలను అనధికారిక ప్రజా ప్రతినిధులుగా గౌరవిస్తూ ఏ విభాగంలో ప్రజలకు పని కావాలంటే అధికారులకు అధికార పార్టీ నేతలకు మామూలు ముట్ట చెప్పాలని డిమాండ్ చేస్తున్నారని వారు ఆరోపించారు. పన్ను వసూలులో వచ్చిన నిధులను కడప కార్పొరేషన్ అధికారులు వారి డిన్నర్లకు, విలాసాలకు, ఛాంబర్ లో రెన్యూవేషన్ పేరుతో లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారని ప్రజాధనాన్ని ఇష్టారాజ్యంగా ఖర్చు చేసే అధికారం వీరికి ఎవరిచ్చారని వారు నిలదీశారు. అనంతరం కడప కార్పొరేషన్ కమిషనర్ రాకేష్ చంద్ర ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు జి వేణుగోపాల్, కేసిబాదుల్లా, సుబ్రమణ్యం, మనోహర్ రెడ్డి, మునయ్య, లింగన్న, రామ్మోహన్ రెడ్డి, బ్రహ్మం, నారాయణ, ఎల్ చంద్ర, లక్ష్మీనారాయణ, సిపిఎం నాయకులు దస్తగిరి రెడ్డి, చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.