పయనించే సూర్యుడు ఏప్రిల్ 09,(చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). చింతకాని మండలంలో రైతులు పండించిన మొక్కజొన్న పంటను ఎలాంటి పరిమితులు లేకుండా ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని చింతకాని మండల తెలుగు రైతు సంఘం మరియు టిడిపి నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు చింతకాని మండలం టిడిపి కార్యాలయంలో నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రభుత్వం ఒక్క రైతు నుంచి గరిష్టంగా 26 క్వింటాళ్ల వరకు మాత్రమే మొక్కజొన్న కొనుగోలు చేస్తామని విధించిన పరిమితిని వెంటనే ఎత్తివేయాలని వారు కోరారు. ఎకరానికి సుమారు 40 క్వింటాళ్ల దిగుబడి వస్తుండగా, కేవలం 26 క్వింటాళ్లకు మాత్రమే పరిమితం చేయడం వల్ల మిగిలిన పంటను ఎక్కడ అమ్ముకోవాలో తెలియక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని తెలిపారు.ప్రైవేట్ వ్యాపారులు క్వింటాల్‌కు సుమారు రూ.1800 మాత్రమే చెల్లిస్తున్నారని, దీనివల్ల రైతులకు క్వింటాల్‌కు రూ.600 వరకు నష్టం వాటిల్లుతోందని అన్నారు. కాబట్టి రైతుల వద్ద ఉన్న మొత్తం మొక్కజొన్నను ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేయాలని మండల టిడిపి అధ్యక్షుడు తేలుకుంట్ల శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.అలాగే కౌలు రైతులు ముందుగానే కౌలు చెల్లించి, అప్పులు తెచ్చుకుని పంట పండిస్తుంటే, వారిపై కూడా ఆంక్షలు విధించడం అన్యాయమని మండల టిడిపి ఉపాధ్యక్షుడు ననక రామారావు అన్నారు. కౌలు రైతులను కూడా ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. నాగులవంచ, పాతర్లపాడు, పొద్దుటూరు తదితర గ్రామాల్లో వెంటనే మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మొక్కజొన్నను కొనుగోలు చేయాలని ఏటుకూరి రవి డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో మండల కోశాధికారి మల్లెల సత్యనారాయణ, సీనియర్ నాయకులు ననక గోపాలరావు, బండి ప్రసాద్, కూచిపూడి సతీష్, కేతపోయిన సురేష్, పొనుగోటి బాబురావు, కిలారి గోపి, పొనుగోటి మోహనరావు తదితరులు పాల్గొన్నారు.