బిజినేపల్లి మండలం బోయాపూర్ గ్రామంలో సిసి రోడ్ల కమిషన్ వివాదం ఉద్రిక్తత

పయనించే సూర్యుడు ఏప్రిల్ 10 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్ నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం బోయాపూర్ గ్రామంలో సీసీ రోడ్ పనులకు సంబంధించిన కమిషన్ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. రూ.10 లక్షల విలువైన సీసీ రోడ్ పనుల్లో భాగంగా రూ.75 వేల కమిషన్ వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కమిషన్ పంపకాల విషయంలో కాంగ్రెస్ కార్యకర్తల మధ్య విభేదాలు చెలరేగాయి. ముగ్గురికి సమానంగా పంచుకోవాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ, పంపకాల విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో తగాదాలు చోటుచేసుకున్నాయి. ఇదే సమయంలో ఒక మాజీ టీఆర్ఎస్ వ్యక్తి కూడా తనకు వాటా ఇవ్వాలని డిమాండ్ చేయడంతో వివాదం మరింత ముదిరింది. కమిషన్ మొత్తం లో రూ.60 వేల యూపీఐ ద్వారా, మిగతా మొత్తం నగదు రూపంలో లావాదేవీలు జరిగినట్లు సమాచారం. అధికారుల సమక్షంలోనే డబ్బుల పంపకం జరగడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పంపకాల అనంతరం ఇరువర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకుని, పరస్పరం దాడులు జరిగినట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయం సైదులు అనే వ్యక్తిపై గ్రామంలో దాడి జరగగా, ఆయనకు తలకు గాయాలు అయ్యాయి. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పాత కక్షల కారణంగానే తనపై దాడి జరిగిందని ఆరోపించారు. కేసు నమోదు చేసిన బిజినేపల్లి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.