
పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్, ఏప్రిల్ 11 మామిడిపెల్లి లక్ష్మణ్ జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని, ప్రతిపక్షాల విమర్శలకు అభివృద్ధి పనులతోనే సమాధానం చెబుతానని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. రాయికల్ మండలంలోని ఉప్పుమడుగు గ్రామంలో రూ.10 లక్షలతో మహిళా సంఘ భవనానికి, రామాజీపేట, జగన్నాథ్‌పూర్ గ్రామాల్లో రూ.20 లక్షల చొప్పున గ్రామపంచాయతీ భవనాలకు, రూ.10 లక్షల చొప్పున మహిళా సంఘ భవనాలకు ఆయన శంకుస్థాపనలు చేశారు. రామాజీపేట గ్రామంలో సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి ప్రత్యేక కృషి చేస్తున్నారని తెలిపారు. విద్య ద్వారానే సమాజంలో గౌరవం లభిస్తుందని పేర్కొన్నారు. ఉప్పుమడుగు గ్రామంలో రూ.4 కోట్లతో నిర్మిస్తున్న కస్తూర్బా పాఠశాల, కళాశాల పనులు దాదాపు పూర్తయ్యాయని, జూన్ నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. నూతన భవనంతో అదనంగా 100 మంది బాలికలకు విద్యావకాశం కలుగుతుందని వెల్లడించారు. జగిత్యాలలో మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటుతో విద్యార్థినులకు ఎంతో ఉపయోగం కలుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావించి ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సన్నబియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు వంటి పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. రైతు భరోసా, రుణమాఫీ ద్వారా రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. జగిత్యాల జిల్లాకు అత్యధిక పల్లె దవాఖానలు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని చెప్పారు.గ్రామ గ్రామాన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పండుగలా కొనసాగుతున్నాయని, మట్టి, ఇసుక సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు. వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లో నీటి వృథా లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.జగన్నాథ్‌పూర్ బ్రిడ్జి నిర్మాణానికి నిరంతరం కృషి చేస్తున్నానని, ఈ విషయమై ఢిల్లీలో కేంద్ర మంత్రిని కూడా కలిసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ముఖ్యమంత్రి, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. చెక్‌డ్యామ్ నిర్మాణంతో జగన్నాథ్‌పూర్‌లో భూగర్భజలాలు పెరిగి వ్యవసాయం మెరుగుపడిందన్నారు. అన్ని కుల సంఘాల భవనాలకు నిధుల మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చిరంజీవి, డీఈ మిలింద్, సర్పంచులు పరాచ శంకర్, రోజా, బెజ్జంకి మోహన్, ఉపసర్పంచ్ మల్లయ్య, సుధీర్ రెడ్డి, గంగాధర్, ఆత్మ చైర్మన్ కాటిపెల్లి గంగారెడ్డి, మండల నాయకులు కోల శ్రీనివాస్, రవీందర్ రావు, ఏనుగు మల్లారెడ్డి, సంధ్యారాణి, సురేందర్ నాయక్, గన్నే రాజిరెడ్డి, శేఖర్ రెడ్డి, తంగేళ్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.