పయనించే సూర్యడు ఏప్రిల్ 11 సూర్యాపేట జిల్లా నడిగూడెం ప్రతినిధి పొలంపల్లి వెంకటేశ్వర్లు చరిత్రకు నిలువుటద్దం, జాతీయ జెండా రూపకల్పనకు పురిటిగడ్డ అయిన నడిగూడెం ప్రాంతానికి తగిన గుర్తింపునివ్వాలని స్థానికులు మరియు మేధావులు గళమెత్తుతున్నారు. రాబోయే నియోజకవర్గాల పునర్విభజన (డెలిమిటేషన్) ప్రక్రియలో నడిగూడెంను ప్రత్యేక అసెంబ్లీ నియోజకవర్గంగా ప్రకటించాలని ప్రధాన డిమాండ్ తెరపైకి వచ్చింది. ఘనమైన చరిత్ర - రాజా నాయని పాలన 19వ శతాబ్దం చివరి నుండి 20వ శతాబ్దం ఆరంభం వరకు నాయిని వంశీయుల పాలనలో నడిగూడెం ఒక వెలుగు వెలిగింది. ముఖ్యంగా రాజా నాయని వెంకట రంగారావు హయాంలో నడిగూడెం కోట రాజకీయ, సాంస్కృతిక కేంద్రంగా విరాజిల్లింది. ఎందరో కవులను, కళాకారులను పోషించిన ఈ గడ్డపై నిర్మించిన కోట నేటికీ ఆనాటి వైభవానికి సాక్ష్యంగా నిలుస్తోంది. జాతీయ జెండాతో అనుబంధం భారతదేశ ఆత్మగౌరవ ప్రతీక అయిన జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య కి నడిగూడెం ప్రాంతంతో విడదీయలేని అనుబంధం ఉంది. 1921లో విజయవాడ (బేజవాడ) కాంగ్రెస్ సమావేశంలో గాంధీజీకి సమర్పించిన జాతీయ జెండా నమూనా రూపకల్పనలో ఈ ప్రాంతం యొక్క ప్రభావం మెండుగా ఉంది. అనంతరం అనేక మార్పుల తర్వాత 1947 ఆగస్టు 15న అమల్లోకి వచ్చిన త్రివర్ణ పతాక చరిత్రలో నడిగూడెం పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడింది. శిథిలావస్థలో చారిత్రక సంపద ఇంతటి ఘన చరిత్ర కలిగిన నడిగూడెం కోట నేడు పాలకుల నిర్లక్ష్యం వల్ల శిథిలావస్థకు చేరుకోవడం పట్ల చరిత్రకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తగిన రక్షణ, గుర్తింపు లేక ఈ చారిత్రక కట్టడం కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. ప్రభుత్వం ముందున్న ప్రధాన డిమాండ్లు నడిగూడెం ప్రాంత ప్రజలు మరియు అభివృద్ధి కమిటీ సభ్యులు ఈ క్రింది డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నారు: నియోజకవర్గ హోదా: డీలిమిటేషన్ ప్రక్రియలో నడిగూడెంను ప్రత్యేక నియోజకవర్గంగా ప్రకటించాలి. చారిత్రక గుర్తింపు: నడిగూడెం కోటను పురావస్తు శాఖ ఆధీనంలోకి తీసుకుని, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి. ప్రాంతీయ అభివృద్ధి: స్థానిక ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించి న్యాయం చేయాలి. "మన చరిత్ర మన గర్వం - మన హక్కు మన గుర్తింపు" అనే నినాదంతో నడిగూడెం గౌరవం కోసం అందరం ఒక్కటై పోరాడదామని స్థానిక నాయకులు పిలుపునిచ్చారు.