పోటు రంగారావుపై అక్రమ ‘ఉపా’ కేసును ఎత్తివేయాలి

సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ డిమాండ్

పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 11 అశ్వారావుపేట మండలం రిపోర్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ​అశ్వారావుపేట సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ పోటు రంగారావుపై జాతీయ దర్యాప్తు సంస్థ కుట్రపూరితంగా నమోదు చేసిన 'ఉపా' కేసును తక్షణమే ఎత్తివేయాలని ఆ పార్టీ అశ్వారావుపేట మండల కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం అశ్వారావుపేటలో పార్టీ డివిజన్ కార్యదర్శి గోకినపల్లి ప్రభాకర్, మండల కార్యదర్శి వాసం బుచ్చిరాజు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ​ప్రజా గొంతుకను నొక్కే ప్రయత్నం ​ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన నిరంకుశ పోకడలతో ప్రజాస్వామ్యవాదుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. గత 50 ఏళ్లుగా పోటు రంగారావు భూమి, భుక్తి, విముక్తి లక్ష్యంగా రాజ్యాంగబద్ధంగా, బహిరంగంగా ప్రజా ఉద్యమాలు నడుపుతున్నారని వారు గుర్తు చేశారు. ప్రజల పక్షాన నిలబడి హక్కుల కోసం పోరాడుతున్న నాయకుడిపై అక్రమ కేసులు బనాయించడం అప్రజాస్వామికమని, రాజ్యాంగ పరిధిలో ఉంటూ ప్రభుత్వాల వైఫల్యాలను ప్రశ్నించడం నేరం ఎలా అవుతుంది?" అని వారు నిలదీశారు. విచారణ నోటీసులపై ఆగ్రహం ​ఉపా చట్టం కింద కేసు నమోదు చేసిన ఎన్ఐఏ, ఈ నెల 22వ తేదీన విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేయడంపై నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మతోన్మాద, ఫాసిస్టు విధానాలను ప్రశ్నించే వారిని అర్బన్ నక్సలైట్లుగా ముద్రవేసి, ఉక్కుపాదంతో అణచివేయాలని చూడటం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. ప్రజాస్వామ్యవాదులకు పిలుపు ​కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డు పెట్టుకుని సాగిస్తున్న ఈ అప్రజాస్వామిక చర్యలను ప్రజలు, మేధావులు, ప్రజాస్వామికవాదులు ముక్తకంఠంతో ఖండించాలని వారు విజ్ఞప్తి చేశారు. తక్షణమే పోటు రంగారావుపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.