విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి: కార్యక్రమంలో నేచురలిస్ట్ శ్వేత.

పయనించే సూర్యుడు ఏప్రిల్ 11 నాగర్ కర్నూల్ జిల్లా బిజినాపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ విద్యార్థులు మంచిగా చదువుకొని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని నేచురలిస్ట్ మరియు తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యూనిట్ మేనేజర్ శ్వేత సూచించారు.జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన వార్షికోత్సవ (యాన్యువల్ డే) వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై ఆమె ప్రసంగించారు. ఈ సందర్భంగా శ్వేత మాట్లాడుతూ ప్రకృతిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. “ప్రకృతిని కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది”అని ఆమె పేర్కొన్నారు.విద్యార్థులు ఎన్ని అవాంతరాలు వచ్చినా చదువును మధ్యలో ఆపకుండా పూర్తిచేసి మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు. కళాశాలలో ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ఘనంగా ఫేర్వెల్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా సీనియర్ విద్యార్థులు తమ అనుభవాలను జూనియర్ విద్యార్థులతో పంచుకున్నారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు. కళాశాల ప్రిన్సిపాల్ మదన్మోహన్ మాట్లాడుతూ విద్యార్థులు చదువు పూర్తయ్యాక ఎక్కడ ఉన్నా ఉన్నత స్థాయిలో ఎదగాలని గురువుల ఆకాంక్ష అని తెలిపారు.భవిష్యత్తులో కష్టపడి మంచి స్థాయికి చేరుకొని తల్లిదండ్రులు, గురువులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కళాశాల ఏవో మొహమ్మద్ ఇర్ఫాన్, అధ్యాపకులు అంజయ్య, వనిత,కోదండరాములు, రామకృష్ణ, దశరథం, ముజఫర్, శోభారాణి, రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.