విద్యార్థుల ఆకలితో ఆటలాడుతున్న బుద్ధవరపు ట్రస్ట్:ఎమ్మెల్యే నల్లమిల్లి ఫైర్

★ భోజనం నాణ్యతపై ఆకస్మిక తనిఖీ ★ ముద్ద అన్నం, వాసన వస్తున్న గుడ్లు.. పాత్రల నిండా అపరిశుభ్రతనాణ్యత ★ పాటించకపోతే తప్పుకోండి.. ట్రస్ట్ నిర్వాహకులకు సీరియస్ వార్నింగ్

పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 11 అనపర్తి నియోజకవర్గం ఇంచార్జ్ సురేష్ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ పౌష్టికాహారాన్ని అందిస్తుంటే, క్షేత్రస్థాయిలో కొన్ని ఏజెన్సీలు విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్నాయి. శుక్రవారం స్థానిక శ్రీరామరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు జరిగిన ఈ తనిఖీలో భోజనం నాణ్యతను చూసి ఎమ్మెల్యే తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.అపరిశుభ్రత.. అస్తవ్యస్తం:ఎమ్మెల్యే స్వయంగా భోజనాన్ని రుచి చూసి, అక్కడ ఉన్న పరిస్థితులపై మండిపడ్డారు. వండిన అన్నం ముద్దగా ఉండటమే కాకుండా, ఆకుకూర పప్పులో అసలు ఆకుకూరలే కనిపించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా విద్యార్థులకు పెడుతున్న గుడ్లు పాత నూనెలో వేయించినట్లుగా దుర్వాసన వస్తుండటం, గుడ్డు పెంకులు కూడా సరిగ్గా తీయకపోవడంపై తీవ్రంగా పరిగణించారు. వంట పాత్రలు, భోజనాన్ని తరలించే వాహనాలు అత్యంత అపరిశుభ్రంగా ఉండటంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.రెండేళ్లుగా అదే తీరు:ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత రెండేళ్లుగా 'బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్' సరఫరా చేస్తున్న భోజనంపై విద్యార్థులు, ఉపాధ్యాయుల నుండి అనేక ఫిర్యాదులు వస్తున్నాయని గుర్తు చేశారు. నాణ్యమైన ఆహారం అందించడం సాధ్యం కాకపోతే ట్రస్ట్ వారు స్వచ్ఛందంగా తప్పుకోవాలని, అంతేకానీ ఇలాంటి నాసిరకం ఆహారం అందించి విద్యార్థుల ఆరోగ్యాన్ని దెబ్బతీయవద్దని హెచ్చరించారు. అధికారులకు ఆదేశం.. మంత్రికి ఫిర్యాదు: ఈ ఘటనపై వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారికి ఫోన్ ద్వారా ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేశారు. ప్రతిరోజూ పిల్లలకు ఎలాంటి ఆహారం అందుతుందో గమనించకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తున్న ఉపాధ్యాయుల తీరును కూడా ఆయన తప్పుబట్టారు. ఈ విషయాన్ని వెంటనే మంత్రి దృష్టికి తీసుకెళ్లి, విద్యార్థులకు పరిశుభ్రమైన, నాణ్యమైన ఆహారం అందేలా కఠిన చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో యువనేత మనోజ్ రెడ్డి మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.