పయనించే సూర్యుడు ఏప్రిల్ 12 ఆదోని రూరల్ రిపోర్టర్ ఆస్పరి మండలంలో పదివేల జనాభా ఉన్న ఆస్పరి మండల కేంద్రం తో పాటుగా గ్రామాల్లో మూడు వారాలకు ఒకసారి మంచి నీరు సరఫరా చేయడం అత్యంత బాధాకరం అని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి ఎ. నూర్ అహ్మద్ పేర్కొన్నారు. ఆస్సరి తాగునీటి సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం, నాయకులు మరియు అధికారులు కలిసి కృషి చేయాలని కోరారు. తాగునీటి సమస్య తో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ముఖ్యంగా మహిళలు, పిల్లలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని , ప్రజలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని నూర్ అహ్మద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పరి తాగు నీటి సమస్య పరిష్కారానికి పదికోన రిజర్వాయర్ లేదా హంద్రీ నీవా కాల్వ నీటిని ఆస్పరి గ్రామానికి తరలించాలని , ఆస్పరికి దగ్గరలో ఒక సమ్మర్ స్టోరేజ్ చెరువును నిర్మించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత వేసవిలో యుద్ధప్రాతిపదికన ఆస్పరికి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని అధికారులను కోరారు. అలాగే ఆలూరు నియోజకవర్గం నుంచి గత ఇరవై సంవత్సరాలలో ఇద్దరు నాయకులు మంత్రులుగా పని చేసినా నియోజకవర్గంలో కనీస సౌకర్యాలు, తాగునీరు అందించడంలో విఫలమయ్యారని విమర్శించారు. ఇప్పుటికైనా నాయకులు ప్రభుత్వం ఆలూరు నియోజకవర్గం అభివృద్ధి, మంచినీటి సమస్య పరిష్కారానికై దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. ఆస్పరి తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని మరొక్కసారి ప్రభుత్వాన్ని, అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో యం హెచ్ పి యస్ రాష్ట్ర కార్యదర్శి ఎ. నూర్ అహ్మద్ నాయకులు నాడంగ్ షకీల్ పాల్గొన్నారు.