పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 13 అనపర్తి నియోజకవర్గం ఇంచార్జ్ సురేష్ అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనుసరిస్తున్న రాజకీయ విధానాలపై మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం ఆయన కార్యాలయం నుండి విడుదల చేసిన ప్రకటనలో ఎమ్మెల్యే వైఖరిని ఎండగట్టారు.విలువల లేని రాజకీయం: "తెలుగుదేశంలోనే పుట్టి, అక్కడే మరణిస్తానని" గతంలో ప్రగల్భాలు పలికిన రామకృష్ణారెడ్డి, కేవలం శాసనసభ సీటు కోసం భారతీయ జనతా పార్టీలోకి చేరడం ఆయన నైతికత లేని రాజకీయాలకు నిదర్శనమని సూర్యనారాయణ రెడ్డి విమర్శించారు. పదవి కోసం కన్నతల్లి వంటి పార్టీని వీడటమే కాకుండా, స్వంత తల్లిని సైతం మండుటెండలో రిక్షాపై తిప్పి ప్రజల సానుభూతి పొందాలని చూడటం హాస్యాస్పదమని, ఈ డ్రామాలను ప్రజలందరూ గమనిస్తున్నారని ఎద్దేవా చేశారు.అవినీతిపై పోరాటం కొనసాగుతుంది:ప్రజలకు సేవ చేయాలన్న తపన ఉన్నవారికి పదవులతో పనిలేదని, కానీ సంపాదనే లక్ష్యంగా పెట్టుకున్న ఎమ్మెల్యేకు అధికారం అత్యవసరమని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే చేస్తున్న ప్రతి అవినీతిని, అక్రమ కేసులను వీడియోల ద్వారా ప్రజల ముందు ఉంచుతూనే ఉంటానని, ఆ వీడియోలు చేయడం ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తన విమర్శలతో ఎమ్మెల్యేకు భయం పట్టుకుందని, నిద్రలో కూడా తన పేరే కలవరిస్తున్నారని మండిపడ్డారు.పనితీరుపై సమాధానం చెప్పాలి:అనవసరమైన విమర్శలు పక్కన పెట్టి, కూటమి ప్రభుత్వం ద్వారా నియోజకవర్గ ప్రజలకు ఇప్పటివరకు చేసిన మేలేమిటో ఎమ్మెల్యే బహిరంగంగా చెప్పాలని సూర్యనారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించడం మానుకొని, ప్రత్యర్థులపై అక్రమ కేసులు పెట్టడమే లక్ష్యంగా పెట్టుకోవడం సరికాదని ఆయన హితవు పలికారు.