పయనించే సూర్యుడు ఏప్రిల్ 14 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్ పాలెం, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యగా 14–15 ఏళ్ల కిషోర బాలికలకు ఉచితంగా గార్డాసిల్ (HPV) టీకాను అందిస్తోంది అని పాలెం వైద్యాధికారి డాక్టర్ ప్రియాంక తెలిపారు. 2011 ఏప్రిల్ 1 నుంచి 2012 మార్చ్ 31 మధ్య జన్మించిన బాలికలు ఈ టీకాకు అర్హులు కాగా, జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో టీకా అందుబాటులో ఉందన్నారు. ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు పూర్తవడంతో పాఠశాలలలో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి వేగంగా టీకాలు వేస్తున్నట్లు వెల్లడించారు. ఈ టీకా పూర్తిగా సురక్షితమని, పలు పరిశోధనల తర్వాతనే అందిస్తున్నామని, తల్లిదండ్రులు ఎలాంటి అపోహలు నమ్మవద్దని సూచించారు. సాధారణంగా మార్కెట్లో రూ.4,000 వరకు ఖర్చయ్యే ఈ టీకాను ప్రభుత్వం ఉచితంగా ఇస్తోందని తెలిపారు. ఒక్క డోస్‌తోనే రక్షణ లభిస్తుందని, టీకా అనంతరం వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నామని చెప్పారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌తో పాటు ఇతర క్యాన్సర్ల నివారణలో కూడా ఇది ప్రభావవంతమని, అర్హులైన బాలికలు వెంటనే టీకా తీసుకోవాలని వైద్యాధికారి సూచించారు.