
పయనించే సూర్యుడు ఏప్రిల్ 14 రాజేష్ దౌల్తాబాద్) దౌల్తాబాద్ మండలం మాచినపల్లి గ్రామంలోని 1వ మరియు 2వ అంగన్వాడి కేంద్రాలలో ఏప్రిల్ 9 నుండి 23 వరకు నిర్వహిస్తున్న పోషణ పక్వాడ కార్యక్రమం గ్రామ సర్పంచ్ నాగరాజు ఆధ్వర్యంలో ఘనంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ పెద్దోళ్ల కవిత గారు, అంగన్వాడి సూపర్వైజర్ గిరిజ గారు, పంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికంగా లభించే ఆహార పదార్థాలు మరియు చిరుధాన్యాలు (మిల్లెట్స్) ఉపయోగించి ఆరోగ్యకరమైన వంటకాల ప్రదర్శన నిర్వహించడంతో పాటు తల్లుల మధ్య వంటల పోటీలు కూడా నిర్వహించారు. పోషక విలువలతో కూడిన ఆహారం తయారీపై తల్లులకు అవగాహన కల్పించారు. ప్రతి వంటకంలో ఉపయోగించిన పదార్థాల పోషక విలువలను వివరించి, సమతుల ఆహారం యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. ఈ ఆరోగ్యకరమైన ఆహారాలను ఇంట్లో కూడా క్రమం తప్పకుండా తయారు చేసుకోవాలని తల్లులను ప్రోత్సహించారు. ఈ కార్యక్రమానికి గ్రామంలోని గర్భవతులు, బాలింతలు మరియు చిన్నపిల్లల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమం ముగింపులో పోషణ పక్షం ప్రతిజ్ఞ చేయించారు. తదుపరి, అంగన్వాడి లెవెల్ మానిటరింగ్ కమిటీ ను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో గ్రామ సర్పంచ్ చైర్‌పర్సన్‌గా, అంగన్వాడి టీచర్ కన్వీనర్‌గా ఉంటారు. ఆశ కార్యకర్త, గర్భవతి, బాలింత, చిన్నపిల్లల తల్లులు, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి, స్కూల్ టీచర్, కిశోర బాలిక, వివో లీడర్లు సభ్యులుగా మొత్తం 11 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయబడింది. ఆరోగ్య లక్ష్మి పథకం కింద తల్లులకు ఇవ్వాల్సిన ఆహార పరిమాణం, మెనూ అమలు విధానం, అంగన్వాడి కేంద్రాలలో ఎదురయ్యే సమస్యలు వంటి అంశాలను ఈ కమిటీ ద్వారా చర్చించి పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమం గ్రామంలో పోషకాహారంపై అవగాహన పెంపొందించడంలో కీలక పాత్ర పోషించింది.