రేషన్ బియ్యం అక్రమ రవాణా: లట్టుపల్లిలో బియ్యం మాఫియా దందాపై కలెక్టర్‌కు ఫిర్యాదు

ప్రజావాణిలో కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన బిజినపల్లి బిజెపి మండల అధ్యక్షుడు గుమ్మకొండ భూషయ్య

పయనించే సూర్యుడు ఏప్రిల్ 14 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ బిజినేపల్లి మండలంలోని లట్టుపల్లి గ్రామంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతోందని ఆరోపిస్తూ బీజేపీ నాయకులు జిల్లా కలెక్టర్‌కు సోమవారం లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. పేదలకు సరఫరా చేయాల్సిన బియ్యాన్ని కొందరు డీలర్లు, వ్యాపారులు కుమ్మక్కై పక్కదారి పట్టిస్తున్నారని వారు పేర్కొన్నారు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం, రేషన్ షాపుల ద్వారా పంపిణీ అయ్యే బియ్యాన్ని తక్కువ ధరకు పేదల వద్ద నుండి సేకరించి, రాత్రి వేళల్లో రైస్ మిల్లర్లకు తరలిస్తూ అక్రమంగా విక్రయిస్తున్నారని ఆరోపించారు. ఈ విధంగా పెద్ద ఎత్తున లాభాలు పొందుతున్నారని తెలిపారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే స్థానిక అధికారులకు పలుమార్లు సమాచారం ఇచ్చినా సరైన చర్యలు తీసుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏప్రిల్ 9న పౌరసరఫరాల అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి మార్పు కనిపించలేదని గుర్తు చేశారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, లట్టుపల్లి గ్రామంతో పాటు బిజినేపల్లి మండల వ్యాప్తంగా జరుగుతున్న రేషన్ బియ్యం అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు గుమ్మకొండ భూషయ్యతో పాటు ఇతర పార్టీ నాయకులు పాల్గొన్నారు.