సీఎంకు పోస్టు కార్డు ఉద్యమానికి అపూర్వ స్పందన.

★ ఇప్పటికైనా స్పందించకపోతే ఆందోళన ఉధృతం. ★ రైల్వే అండర్ బ్రిడ్జి సాధన కమిటీ కన్వీనర్ రామకృష్ణారెడ్డి, రామమోహన్

పయనించే సూర్యుడు న్యూస్ :ఏప్రిల్: 14 కడప కడప నగరం ఎర్రముక్కపల్లి - విశ్వనాధపురం మధ్య ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి పెండింగ్లో ఉన్న నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ రైల్వే అండర్ బ్రిడ్జి సాధన కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్యమంత్రి పోస్టు కార్డు ఉద్యమానికి అపూర్వ స్పందన లభించిందని రైల్వే అండర్ బ్రిడ్జి సాధన కమిటీ కన్వీనర్ రామకృష్ణారెడ్డి, రామమోహన్ తెలిపారు. సోమవారం నాడు కడప నగరంలోని విశ్వనాధపురం రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద ముఖ్యమంత్రికి పోస్టు కార్డుల ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేసినా స్పందన లేని కారణంగానే ముఖ్యమంత్రికి పోస్టు కార్డు ఉద్యమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయకపోవడం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని నిధులు విడుదల చేసి పెండింగ్లో ఉన్న నిర్మాణాన్ని పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు. ఈ బ్రిడ్జి నిర్మాణం పెండింగ్లో ఉండడం కారణంగా శవాలను తీసుకెళ్లడానికి కూడా తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి కల్పిస్తోందన్నారు. బాలింతలు, గర్భవతులు, మహిళలు, వికలాంగులు ఈ ప్రాంతం గుండా వెళ్లలేక అష్ట కష్టాలు పడుతున్నారన్నారు. కానీ ఈ ప్రాంత ప్రజా ప్రతినిధిగా ఉన్న ఎమ్మెల్యే స్పందించకపోవడం సమంజసం కాదన్నారు. ఇప్పటికైనా జోక్యం చేసుకొని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. కడప నగరపాలక సంస్థ ఇటీవల ప్రజల నుంచి పెద్ద ఎత్తున పన్నుల రూపంలో నిధులు సమకూర్చుకున్నదని, ఇలాంటి పరిస్థితుల్లో కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో చేసిన తీర్మానానికి అనుగుణంగా నిధులు విడుదల చేసి సమస్య పరిష్కరించటానికి కృషి చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో ఈ పోరాటాన్ని మరింత తీవ్రతరం చేయాలని నిర్ణయించినట్టు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైల్వే అండర్ బ్రిడ్జి సాధన కమిటీ నాయకులు నరసింహ, లక్ష్మీనారాయణ, శ్రీరాములు, విజయ భాస్కర్, నాగేశ్వరరావు, భవాని, వరదారెడ్డి, ప్రసాద్ రెడ్డి, కామనూరు శ్రీనివాసులరెడ్డి, చంద్రారెడ్డి, రవి, సుమంత్, అంకమ్మ, విజయమ్మ, సీపీ రమణ తదితరులు పాల్గొన్నారు.