
పయనించే సూర్యుడు ఏప్రిల్ 15, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) ముఖ్య అతిథులుగా… అల్లూరి వారి ఇంట పెళ్లి సందడి – ప్రముఖుల సందడి యానాం: అల్లూరి కుటుంబంలో జరిగిన శుభవివాహ వేడుకలు అంగరంగ వైభవంగా, కన్నులపండువగా జరిగి యానాంలో హాట్ టాపిక్‌గా మారాయి. శ్రీ అల్లూరి రామభద్రరాజు గారి కుమార్తె లక్ష్మి అన్విత వివాహం, చాణుక్య వంశీ కృష్ణ వర్మతో యానాం బైపాస్ రోడ్డులోని శ్రీ పెద్దిరెడ్డి కృష్ణ వినాయకరావు కాపు కళ్యాణ మండపంలో ఘనంగా జరిగింది. ఈ వేడుక ప్రత్యేకత ఏమిటంటే… ఇది కేవలం ఒక వివాహ వేడుక మాత్రమే కాదు, సంవత్సరాలుగా కొనసాగుతున్న రాజమహేంద్రవరం సత్యసాయి గురుకులం బాల్య స్నేహానికి ఒక గొప్ప నిదర్శనం. వధువు తండ్రి రామభద్రరాజు మరియు ప్రముఖ లాయర్ పులగం రామకృష్ణారెడ్డి ఇద్దరూ అక్కడ కలిసి చదువుకున్న బాల్యమిత్రులు. ఆ అనుబంధం కాలక్రమేణా కుటుంబ స్నేహంగా మారి, ఈ వివాహానికి ప్రత్యేకంగా విచ్చేయడం ఈ వేడుకకు మరింత గౌరవాన్ని తీసుకొచ్చింది. ఈ శుభకార్యానికి ముఖ్య అతిధులుగా పులగం చిన్నారెడ్డి (రిటైర్డ్ ఎండిఓ), శ్రీమతి బుల్లెమ్మాయి దంపతులు, లాయర్ పులగం రామకృష్ణారెడ్డి – శ్రీమతి శిరీష దంపతులు, వట్టికూరి పుల్లాజీ దంపతులు, నల్లమిల్లి నాగవర ప్రసాద్ రెడ్డి అలియాస్ జడ్జి, వెన్నపు వీర వెంకట సత్యనారాయణ, తారక రాంప్రసాద్, రామస్వామి తదితర ప్రముఖులు పాల్గొన్నారు. అదనంగా ప్రముఖ రాజకీయ నాయకులు, వైద్యులు, న్యాయవాదులు, వివిధ యూనియన్లు, సంఘసంస్కర్తలు, అలాగే వధువు తండ్రి రామభద్రరాజు అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున హాజరై వధూవరులను ఆశీర్వదించారు. వివాహ వేదిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కళ్యాణ మండపం మొత్తం అద్భుతమైన అలంకరణలతో మెరిసిపోతూ, బయట భాగంలో ఏర్పాటు చేసిన లైటింగ్ వేడుకకు మరింత శోభను తీసుకొచ్చింది. రాత్రి వేళల్లో వెలుగుల కాంతులు కళ్లకు కట్టినట్టుగా కనిపించాయి. విందు కార్యక్రమం కూడా భారీ ఎత్తున నిర్వహించబడింది. అతిథుల కోసం ఏర్పాటు చేసిన టిఫిన్లు, భోజనాలు విభిన్న రకాల వంటకాలతో రుచికరంగా వడ్డించబడగా, వచ్చిన ప్రతి ఒక్కరూ ఆతిథ్యానికి ముగ్ధులయ్యారు. సంప్రదాయ రుచులు, ఆధునిక వంటకాల సమ్మేళనం అందరినీ ఆకట్టుకుంది. సాయంత్రం నుంచే ప్రారంభమైన సందడి రాత్రంతా కొనసాగగా, బంధుమిత్రులు, ఆహ్వానితులు భారీ సంఖ్యలో హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అదే విధంగా ఈ శుభకార్య సందర్భంగా రామభద్రరాజు దంపతులు తమ కుమార్తె, అల్లుడు పేరున పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం విశేషం. ప్రత్యేకంగా పిలిచిన వెంటనే రాజమహేంద్రవరం సత్యసాయి గురుకులం బాల్య స్నేహితులందరూ హాజరై వధూవరులకు ఆశీస్సులు అందజేయగా, ఆ దృశ్యం కార్యక్రమానికి మరింత భావోద్వేగాన్ని జోడించింది. ఈ సందర్భంగా అల్లూరి రామభద్రరాజు దంపతులు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. స్నేహం కాలాన్ని దాటి ఫ్యామిలీ ఫ్రెండ్స్‌గా మారినప్పుడు అటువంటి వేడుకలు మరింత భావోద్వేగంగా నిలుస్తాయి. అల్లూరి ఇంట ఈ వివాహం అలాంటి అనుబంధానికి చిరస్మరణీయ సాక్ష్యంగా నిలిచింది.