పయనించే సూర్యుడు జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 16 వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణానికి చెందిన ప్రతిభావంతుడైన యువ క్రీడాకారుడు మోహిజ్ అంతర్జాతీయ స్థాయిలో తన ప్రతిభను చాటి, భారతదేశానికి గర్వకారణంగా నిలిచాడు. నేపాల్ దేశ రాజధాని ఖాట్మండు నగరంలో ఏప్రిల్ 7 నుండి 9 వరకు నిర్వహించిన అంతర్జాతీయ షూటింగ్ బాల్ పోటీలలో భారత జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించిన మోహిజ్, అద్భుత ప్రతిభ కనబరచి జట్టుకు విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించి గోల్డ్ మెడల్ సాధించాడు. మొత్తం ఐదు మ్యాచ్‌లలో భారత జట్టు విజయం సాధించడం గర్వకారణం. ఈ విజయోత్సాహంలో భాగంగా, తాండూర్ పట్టణంలోని అక్షర కాన్సెప్ట్ పాఠశాల ఆధ్వర్యంలో మోహిజ్‌కు పాఠశాల యాజమాన్యం అతనికి శాలువా, పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా సత్కరించడమే కాకుండా, ఆర్థిక ప్రోత్సాహాన్ని కూడా అందించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ మోహన కృష్ణ గౌడ్ మాట్లాడుతూ "మోహిజ్ సాధించిన విజయం కేవలం అతని వ్యక్తిగత విజయమే కాదు, తాండూర్ పట్టణం, మన రాష్ట్రానికి, దేశానికే గర్వకారణం అని అన్నారు. కఠోర శ్రమ, క్రమశిక్షణ, పట్టుదల ఉంటే ఏ స్థాయికైనా ఎదగవచ్చని మోహిజ్ నిరూపించాడు. భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని, దేశానికి మరిన్ని పతకాలు అందించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము" అని పేర్కొన్నారు. అదేవిధంగా పాఠశాలల్లో విద్యతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యమని, క్రీడల ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, ధైర్యం, సమయపాలన పెరుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్య సభ్యులు సి.ప్రవీణ్ కుమార్, శ్రీకాంత్ కులకర్ణి, రవీందర్ రెడ్డి, ఎండీ యూనస్, శోభా రాణి,విద్యార్థులు, ఉపాధ్యాయులు కూడా పెద్ద సంఖ్యలో హాజరై హర్షధ్వానాలతో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ మోహిజ్‌ను అభినందించారు. ఈ ఘన సన్మాన కార్యక్రమం తాండూర్ పట్టణంలో క్రీడా స్పూర్తిని పెంపొందించడంలో ఒక ప్రేరణాత్మక ఘట్టంగా నిలుస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధి సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.