పయనించే సూర్యడు ప్రతినిధి సాగర్ ఏప్రిల్.16.2026 ఆదివాసీ ప్రాంతాల్లో గిరిజన చట్టాల అమలులో యంత్రాంగం వైఫల్యం చెందుతోందని, తక్షణమే జిల్లా యంత్రాంగం స్పందించి అక్రమాలను అడ్డుకోవాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ డిమాండ్ చేసింది.బుధవారం చింతూరు ఐటీడీఏలో నిర్వహించిన కలెక్టర్ గ్రీవెన్స్‌లో జిల్లా కలెక్టర్ మరియు పీఓకు సంఘం నేతలు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..చింతూరు మండలం చిడుమూరు పంచాయతీలో గ్రామసభల తీర్మానాలకు వ్యతిరేకంగా అక్రమ మైనింగ్ ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఎర్రంపేటలో హైకోర్టు స్టే ఉన్నప్పటికీ యథేచ్ఛగా అక్రమ భూ బదలాయింపులు,భవన నిర్మాణాలు చేపడుతూ కోర్టు దిక్కరణకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఎటపాక మండలం లక్ష్మీదేవిపేట రెవెన్యూ పరిధిలో సుమారు 40 ఎకరాల ప్రభుత్వ భూమిని నాన్-ట్రైబల్స్ కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.మరోవైపు, నకిలీ గుర్తింపు కార్డులతో సబ్సిడీ పేరుతో ఎటపాక మండలం చెన్నంపేట గ్రామానికి చెందిన పూనెం వీరస్వామి వంటి అమాయక ఆదివాసీలను మోసం చేస్తున్న పండ వరలక్ష్మి,పండ పోతురాజు దొర బృందంపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు.అలాగే సమాచార హక్కు చట్టం కింద వివరాలు అడిగినా ఇవ్వని వీఆర్ పురం తహసీల్దార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏజెన్సీలో 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తూ,అక్రమ కట్టడాలను తొలగించాలని,నిబంధనలకు విరుద్ధంగా నాన్-ట్రైబల్స్‌కు విద్యుత్ మీటర్లు జారీ చేయవద్దని డిమాండ్ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఎల్.టి.ఆర్.పి సెక్షన్ 3(1),3(5),6A ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు పూనెం వీరస్వామి,కారం వెంకటేశ్వర్లు, తెల్లం సత్యనారాయణ,సొందే లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.కుంజా శ్రీను ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.