జనం న్యూస్ ఏప్రిల్ 15 కోటబొమ్మాళి మండలం :జాతీయ స్థాయిలో ఎదురయ్యే విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొని అధిగమించాల్సిన అవసరం ఉందని కోటబొమ్మాళి ఎం.పీ.డీ.వో, మేజర్ పంచాయితీ ప్రత్యేక అధికారి కుప్పిలి ఫణీంద్ర కుమార్ తెలిపారు. మంగళవారం జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాల సందర్భంగా స్థానిక అగ్నిమాపక కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏప్రిల్ 14 నుండి 20వ తేదీ వరకు నిర్వహించే అగ్నిమాపక సేవల వారోత్సవాల్లో ప్రతి ఒక్కరూ చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. విపత్తుల సమయంలో ఎలా స్పందించాలి, ముఖ్యంగా అగ్ని ప్రమాదాలను ఎలా నివారించాలి, సంభవించినప్పుడు వాటిని ఎలా నియంత్రించాలి అనే అంశాలపై ప్రజలకు అవగాహన పెంపొందించుకోవడం అత్యంత అవసరమని అన్నారు.ప్రత్యేకంగా మహిళలు గృహ స్థాయిలో తీసుకోవలసిన జాగ్రత్తలు, భద్రతా చర్యలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. వారోత్సవాల సందర్భంగా నిర్వహించే ప్రదర్శనలు (డెమోలు)లో పాల్గొని అగ్నిమాపక సిబ్బంది ఇచ్చే సూచనలు, మార్గదర్శకాలను పాటించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో భాగంగా అగ్నిమాపక సేవల వారోత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో స్థానిక అగ్నిమాపక అధికారి పీ.ఆర్. రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు