జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం

పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 16 అశ్వారావుపేట మండలం రిపోర్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు “అరైవ్ ఎలైవ్” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని శ్రీ శ్రీ ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, మున్సిపల్ పాలకమండలి సభ్యులు, అధికారులు, విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించడం అత్యవసరమని అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రాణాంతకమని హెచ్చరించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని, హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడపకూడదని స్పష్టం చేశారు. కారులో ప్రయాణించే వారు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ మాట్లాడుతూ, “అరైవ్ ఎలైవ్” కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రజల్లో రోడ్డు భద్రతపై చైతన్యం కల్పించడం అని తెలిపారు. ముఖ్యంగా యువతలో ట్రాఫిక్ నియమాల పట్ల అవగాహన పెంపొందించడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని అన్నారు. చిన్న చిన్న నిర్లక్ష్యాలు కూడా పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయని హెచ్చరిస్తూ, ప్రతి ఒక్కరూ బాధ్యతగా డ్రైవింగ్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కళాకారులచే రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థుల్లో చైతన్యం పెంపొందించేందుకు పాఠశాల స్థాయిలో వక్తృత్వ పోటీలు నిర్వహించగా, అందులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, ఎస్పీ రోహిత్ రాజ్, మున్సిపల్ చైర్మన్ శశికళ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. అనంతరం రోడ్లపై హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేసి, వాటి ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజలు కలిసి రోడ్డు భద్రత నియమాలను పాటిస్తూ సురక్షిత ప్రయాణం చేయాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జూపల్లి శశికళ, వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు, ఆత్మ కమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు, మండల అధ్యక్షుడు చిన్నంశెట్టి సత్యనారాయణ, జూపల్లి ప్రమోద్, మున్సిపల్ కమిషనర్ నాగరాజు, అశ్వారావుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు, ఎస్సై యాయంతి రాజు, అదనపు ఎస్ఐ అఖిల, ఎంపీడీవో అప్పారావు, మున్సిపాలిటీ పాలకవర్గ సభ్యులు, సర్పంచులు, ఉప సర్పంచులు, అంగన్వాడి కార్యకర్తలు, వివోఏ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.