టిడ్కో గృహాల్లో మౌలిక వసతులు కల్పించాలి

★ పాలకుల అనాలోచిత చర్యలతో సామాన్య ప్రజల అగచాట్లు ★ సీపీఐ జిల్లా కార్యదర్శి అరిగెల సాయి పిలుపు

పయనించే సూర్యుడు ఏప్రిల్ 16 గూడూరు న్యూస్ టిడ్కో గృహాల్లో మౌలిక వసతులు కల్పించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి అరిగెల సాయి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీపీఐ, అనుబంధ సంఘాల నాయకులు క్షేత్ర స్థాయిలో ప్రజా సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. టిడ్కో గృహ సముదయాలలో మౌలిక వసతులు లేక లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం స్పందించి టిడ్కో బహుళ గృహ సముదాయాలలో వెంటనే కనీస వసతులు నీరు, విద్యుత్, గృహ మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో కార్మికులు, కర్షకులు, పేద ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. యుద్ధం సాకుతో గ్యాస్ దొరక్క వ్యాపారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. సీపీఐతోనే ప్రజా సమస్యల పరిష్కారం సాధ్యమన్నారు. కార్మిక, కర్షక, పేదల సమస్యల పట్ల సీపీఐ నిరంతరం రాజీలేని పోరాటం చేస్తుందన్నారు. వందేళ్ళుగా ప్రజా సమస్యల పట్ల పోరాడుతున్న ఏకైక పార్టీ సీపీఐ అన్నారు. మేడే ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సిహెచ్. ప్రభాకర్, నియోజకవర్గ కార్యదర్శి జీ. శశి కుమార్, సీపీఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శి, ఇన్సాఫ్ జిల్లా కార్యదర్శి షేక్ జమాలుల్లా, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కొమ్మి నారాయణ, సీపీఐ పట్టణ కన్వీనర్ సునీల్ యాదాల, బికె. ఎంయూ నియోజకవర్గ కార్యదర్శి ఎన్. శ్రీనివాసమూర్తి, తదితరులు పాల్గొన్నారు.