తొగుట మండలంలో రోడ్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహణ

"రోడ్డు సేఫ్టీ పై అవగాహన కల్పిస్తున్న సిఐ. ఎస్.కె. లతీఫ్ ఎస్సై .రవికాంత్ రావు"

పయనించే సూర్యుడు ఏప్రిల్ 16 రాజేష్ దౌల్తాబాద్) తొగుట మండలంలో రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమాలు వేగవంతంగా కొనసాగుతున్నాయి. “అర్రివే అల్లివే” 4వ దశ కార్యక్రమంలో భాగంగా ఈరోజు తొగుట కేజీబీవీ పాఠశాలలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తొగుట సీఐ ఎస్.కె. లాతీఫ్ గారు, ఎస్సై వి. రవికాంత్ రావు గారు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొని విద్యార్థులకు రహదారి భద్రతపై విలువైన సూచనలు అందించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులలో చైతన్యం పెంచేందుకు లెటర్ రైటింగ్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ చిన్న వయసులో వాహనాలు నడపకూడదని, మైనర్ డ్రైవింగ్ ప్రమాదకరమని హెచ్చరించారు. అలాగే ట్రిపుల్ రైడింగ్ చేయకూడదని, హెల్మెట్ ధరించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సూచించారు. రోడ్డు దాటేటప్పుడు తప్పనిసరిగా జీబ్రా క్రాసింగ్ వినియోగించాలనే విషయాన్ని ప్రత్యేకంగా వివరించారు. తరువాత తొగుట ఎక్స్ రోడ్ వద్ద విద్యార్థులు మరియు పోలీస్ సిబ్బంది కలిసి హ్యూమన్ చైన్ ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించిన వాహనదారులకు గులాబీ పువ్వులు అందజేసి ప్రోత్సహించారు. ఈ కార్యక్రమం స్థానిక ప్రజల్లో మంచి స్పందనను పొందింది. ఈ అవగాహన కార్యక్రమంలో కేజీబీవీ పాఠశాల సిబ్బంది, పోలీస్ అధికారులు, సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. రహదారి భద్రతపై ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో బాధ్యతాయుత ప్రవర్తనకు దోహదపడతాయని అధికారులు తెలిపారు.